రోజుకు రెండు సార్లు బాదంపప్పును తినడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం మెరుగు పడుతుందని, దీంతో డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఒక అధ్యయనం చేపట్టారు. బాదంపప్పులను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగు పడ్డాయని, ప్రీ డయాబెటిస్ స్టేజిలో ఉన్నవారు బాదంపప్పును తినడం వల్ల డయాబెటిస్ రాకుండా నివారించారని తేలింది.
బాదంపప్పును రోజుకు రెండు సార్లు తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) స్థాయిలు తగ్గాయని, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) స్థాయిలు పెరిగాయని నిర్దారించారు. ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ముఖ్యంగా పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలని, రోజూ వ్యాయామం చేయాలని.. దీంతో డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.
రోజుకు రెండు సార్లు సింపుల్‌గా బాదంపప్పును తింటే చాలు ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నవారే కాదు, ఇతరులు ఎవరైనా సరే.. టైప్ 2 డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ మేరకు ముంబైలోని సర్ విఠల్‌డిస్ థాకర్‌సే కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ జగ్‌మీత్ మదన్ తెలిపారు. ఈ అధ్యయనానికి ఆయన ప్రధాన పరిశోధకులుగా ఉన్నారు.
రోజూ బాదంపప్పును రెండు సార్లు తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ స్థాయిలు, హెచ్‌బీఎ1సి స్థాయిలు తగ్గాయని, కేవలం 12 వారాల్లోనే మార్పులు వచ్చాయని తెలిపారు. అధ్యయనంలో 275 మంది పాల్గొన్నట్లు వివరించారు. వారిలో 59 మంది పురుషులు కాగా 216 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ ప్రీ డయాబెటిస్ స్టేజిలో ఉన్నారు.
స్టడీలో పాల్గొన్న వారందరికీ రోజుకు 2 సార్లు బాదంపప్పులను ఇచ్చారు. 28 గ్రాముల చొప్పున ఉదయం, సాయంత్రం వాటిని ఇచ్చారు. మొత్తం రోజుకు 56 గ్రాముల బాదంపప్పును తీసుకున్నారు. 3 నెలల పాటు అలా ఇచ్చారు. దీంతో వారిలో షుగర్ లెవల్స్ తగ్గాయని, ప్రీ డయాబెటిస్ స్టేజి నుంచి బయట పడ్డారని, టైప్ 2 డయాబెటిస్ రాకుండా అడ్డుకున్నారని వివరించారు. అందువల్ల రోజూ ఉదయం, సాయంత్రం బాదంపప్పును తింటే షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవడంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయని చెబుతున్నారు.