ఫ్లోరైడ్… దీని గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ఈ వ్యాధి బారిన పడ్డవారికి కలిగే దుష్ఫలితాలు అన్నీ ఇన్నీ కావు. ఎముకలు పెళుసుబారిపోతాయి. వంకర్లు తిరుగుతాయి. ఇతర ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తాయి. ప్రాణాంతక పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. ఈ క్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి చాలా మంది ప్రజలు ఈ సమస్య తో బాధ పడుతున్నారు కూడా. అయితే ఇప్పటికి ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్లారు. ప్రభుత్వాలు మారాయి. అయినా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాలేదు. కాదు… అసలు నాయకులు దాని గురించి పట్టించుకోలేదు అంటే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే గత 8 సంవత్సరాల కిందటే ఫ్లోరైడ్ సమస్యకు పలు పరిశోధనల ద్వారా పరిష్కారం దొరికింది కూడా. కానీ దాన్ని ముందుకు తీసుకురావడంలో నాయకులెవరూ శ్రద్ధ చూపలేదు. ఇంతకీ ఏంటా పరిష్కారం అంటే… తులసి..! అవును, మహిళలు నిత్యం పూజించే తులసి మొక్కే ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం.
నీటిలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించడంలో తులసి మొక్క ఆకులు అద్భుతంగా పనిచేస్తాయని తెలియడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌తోపాటు రాజస్థాన్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థలు తులసి మొక్క ఆకులు, ఫ్లోరైడ్ నీటిపై పరిశోధనలు చేశాయి. నార్కెట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డి గూడెంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాల నుంచి బోరు బావి నీటిని వారు తెప్పించుకుని ఆ నీటిలో తులసి మొక్కలు వేసి పరిశోధనలు జరిపారు. ఫ్లోరైడ్ ఉన్న నీటిని 100 ఎంఎల్ మోతాదులో తీసుకుని అందులో 75 మిల్లీ గ్రాముల తులసి ఆకులను వేసి ఒక గంట పాటు ఉంచారు. అనంతరం తెలిసిందేమిటంటే… సదరు నీటిలో ఫ్లోరైడ్ శాతం 95 వరకు తగ్గిందని గుర్తించారు.
అలాగే మరో 100 ఎంఎల్ నీటిని తీసుకుని ఈ సారి మళ్లీ అలాగే తులసి ఆకులను వేసి ఇంకా కొద్దిగా ఎక్కువ సమయం పాటు అంటే 10 గంటల పాటు ఆ ఆకులను ఆ నీటిలో అలాగే ఉంచారు. అనంతరం మళ్లీ నీటిలో ఉన్న ఫ్లోరైడ్ శాతాన్ని పరిశీలించగా అది 7.4 పీపీఎం నుంచి 1.2 పీపీఎంకు తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం మనం తాగే నీటిలో 0.5 పీపీఎం నుంచి 1.5 పీపీఎం మధ్య ఫ్లోరైడ్ ఉండవచ్చు. దాంతో ప్రమాదం ఏమీ ఉండదు. ఈ ప్రకారం చూస్తే పైన చెప్పిన పరిశోధనలో వచ్చిన 1.2 పీపీఎం విలువ సదరు ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకే ఉంది. అంటే ఫ్లోరైడ్ నీటిలో తులసి ఆకులను ఎక్కువ సేపు ఉంచి అనంతరం ఆ నీటిని సేవించవచ్చని, దాంతో ప్రమాదం ఏమీ ఉండదని తేల్చారు. అయితే పలువురు సైంటిస్టులు మాత్రం ఈ పరిశోధనను అశాస్త్రీయమని కొట్టి పారేస్తున్నారు. శాస్త్రీయంగా ల్యాబొరేటరీల్లో, జాతీయ పరిశోధన సంస్థలచే పరిశోధనలు చేసిన అనంతరం మాత్రమే ఆ నీటికి సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని వాదిస్తున్నారు.
పైన చెప్పిన పరిశోధనలు, వాదనలు వెరసి… ఇదంతా జరిగింది గత 8 ఏళ్ల క్రితం. కానీ కాలక్రమేణా అందరూ దీని గురించి పూర్తిగా మరిచిపోయారు. ఇప్పటికైనా తులసి మొక్క ఆకులతో మళ్లీ శాస్త్రీయంగా ప్రయోగాలు చేసి తద్వారా వచ్చే ఫలితాన్ని జనాలకు అందిస్తే దాంతో ఫ్లోరైడ్ రక్కసి నుంచి విముక్తి పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నాయకులారా… ఈ ప్రయోగాలపై ఓసారి దృష్టి సారించండి మరి..! సంజీవని లాంటి ఔషధ గుణాలు ఉన్న తులసి మొక్కతో ఫ్లోరైడ్ సమస్య తీరుతుందంటే దాంతో మన పేద ప్రజలకు ఎంతో మేలే జరుగుతుంది కదా. ఈ మొక్కలు మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కాబట్టి వాటితో నీటిని శుద్ధి చేయడం కూడా చాలా తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. దీంతో జనాలకు అత్యంత శుద్ధి అయిన నీటిని అందించిన వారమవుతాం.