Bangladesh Vs South Africa : సౌతాఫ్రికాను తమ సొంత దేశంలో ఓడించాలంటే ఇతర దేశాలకు కాస్త కష్టమైన పనే. అయితే ఆ పనిని బంగ్లాదేశ్ జట్టు సుసాధ్యం చేసి చూపించింది. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా ఆ జట్టుతో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లా జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. బంగ్లా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా కుప్పకూలింది. తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో బంగ్లా జట్టు ఆ స్కోరును సునాయాసంగానే ఛేదించింది. దీంతో చివరి వన్డేలో సౌతాఫ్రికాపై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు 37 ఓవర్లలోనే కేవలం 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో జె.మలన్ (39 పరుగులు) మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 5 వికెట్లు పడగొట్టగా, షకిబ్ అల్ హసన్ 2, హసన్ మిరాజ్, షొరిఫుల్ ఇస్లాం చెరొక వికెట్ చొప్పున తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్‌ను మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసింది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 87 పరుగులు నాటౌట్ (14 ఫోర్లు), లైటన్ దాస్ 48 పరుగులు (8 ఫోర్లు) చేసి ఆకట్టుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్‌కు 1 వికెట్ దక్కింది. ఇక టస్కిన్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.