సూరత్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా కొనసాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో మణిపాల్ టైగర్స్‌పై సదరన్ సూపర్ స్టార్స్ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్ స్టార్స్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ తన వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. సదరన్ సూపర్ స్టార్స్ ముందుగా బ్యాటింగ్ చేయగా మార్టిన్ గప్తిల్ 29 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. అందులో 8 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి.
మార్టిన్ గప్తిల్ తన ఇన్నింగ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రతి బౌలర్‌ను నిర్దాక్షిణ్యంగా బాదేశాడు. ముఖ్యంగా డాన్ క్రిస్టియన్ బౌలింగ్‌లో 30 పరుగులు రాబట్టాడు. 9వ ఓవర్‌లో అతను వేసిన 4 వరుస బంతులకు 4 సిక్సర్లను గప్తిల్ బాదాడు. దీంతో ఒక బంతి కామెంట్రీ బాక్స్ అద్దాలకు తగిలి అవి పగిలిపోయాయి.
ఇక ఈ మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్ జట్టు 4వ విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. మణిపాల్ టైగర్స్ మాత్రం టేబుల్‌లో కింది స్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ సైతం గెలవలేదు. ఇక గప్తిల్‌కు గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ టీమ్‌లో చోటు లభించలేదు. దీంతో అతను న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్టును వదులుకున్నాడు. తరువాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. కానీ తాజా ఇన్నింగ్స్‌తో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కాగా గప్తిల్ కొట్టిన నాలుగు సిక్సర్ల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి.
MARTIN GUPTILL BROKE COMM BOX WINDOW. 🤯🔥
– Vintage Guptill in LLC, 68 in just 29 balls. pic.twitter.com/VTWnB1FpVH
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024