మీ స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా..? చూశాం, కానీ అందులో అంతగా గమనించదగింది ఏముందీ, కెమెరా, దానికి సంబంధించిన ఫ్లాష్ ఉంటాయి, అంతే కదా, అంటారా! అయితే మీరు చెప్పింది కరెక్టే కానీ, ఆ కెమెరాకు, ఫ్లాష్‌కు మధ్య ఓ చిన్నపాటి రంధ్రం ఉంటుంది( కొన్ని ఫోన్లకు ఫ్రంట్ కెమెరా దగ్గర ఉంటుంది). దాన్ని ఎప్పుడైనా చూశారా? చూశాం కానీ పెద్దగా పట్టించుకోలేదు అనబోతున్నారా? ఆ..! అయితే అక్కడే ఆగండి. ఎందుకంటే ఆ రంధ్రం గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అసలు ఆ రంధ్రం ఏమిటి? అది అక్కడ ఎందుకు ఉంటుంది? తెలుసుకుందాం రండి.
ఐఫోన్ వెనుక భాగంలో కెమెరాకు, ఫ్లాష్‌కు మధ్య ఉండే చిన్నపాటి రంధ్రాన్ని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు. అంటే అది ఓ మైక్రోఫోన్ అన్నమాట. అంతేగానీ దాంతో కాల్స్ వినలేం, మాట్లాడలేం. మరెందుకు అది అక్కడ ఇచ్చారనేగా మీ డౌట్! అదే ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మనం ఏదైనా బహిరంగ ప్రదేశంలో, శబ్దం ఎక్కువగా ఉన్న చోట నిలబడి ఫోన్‌లో మాట్లాడితే అవతలి వ్యక్తులకు సరిగ్గా వినబడదు కదా..! అవును, వినబడదు..! ఈ క్రమంలో అలాంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ అవతలి వ్యక్తులకు మనం మాట్లాడేది క్రిస్టల్ క్లియర్‌గా వినిపించడం కోసమే ఐఫోన్ వెనుక భాగంలో ఆ మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేశారు. అందుకే దాన్ని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అని పిలుస్తారు. ఈ మైక్ దాని పరిసరాల్లో ఉన్న శబ్దాలను తగ్గిస్తుందన్నమాట. దీంతో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తులకు క్లియర్‌గా మాట వినబడుతుంది. అయితే ఈ మైక్ ద్వారా యూజర్లు ఐఫోన్‌లో కాల్స్‌ను మరింత క్వాలిటీగా రికార్డ్ కూడా చేసుకోవచ్చట. తెలుసుకున్నారుగా, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ గురించి! ఇకపై ఎప్పుడైనా మీ చేతిలోకి ఐఫోన్ వస్తే ఆ మైక్‌ను ఒకసారి పరిశీలించడం మరిచిపోకండేం! అయితే ఇప్పుడు చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నారు.