ఒకప్పుడు ఏమోగానీ నేటి తరుణంలో మనకు క్రెడిట్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికీ ఒక కామన్ వస్తువుగా మారాయి. నేడు అనేక మంది అనేక బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అనేక బ్యాంకులు రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్‌లు అందిస్తుండడంతో ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం ఎక్కువైంది. అయితే ఇందుకు తగినట్టుగానే నేరగాళ్లు కూడా నకిలీ క్రెడిట్ కార్డులను తయారు చేయడం ఎక్కువ చేశారు. అదీ.. క్రెడిట్ కార్డు స్కిమ్మర్ మెషిన్లను ఉపయోగించి ఆ పని చేస్తున్నారు. వాటి ద్వారా మన క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగిలించి మన కార్డులను పోలిన కార్డులను డూప్లికేట్ రూపంలో తయారు చేసి వాటి ద్వారా డబ్బులను దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా నేరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే వీటిని ఆపేదెలా..? అంటే అందుకు పరిష్కారం ఉంది. మనం స్కిమ్మర్ మెషిన్ల గురించి తెలుసుకుంటే చాలు, దాంతో మన కార్డును ఎవరైనా డూప్లికేట్ చేస్తారా లేదా అన్నది ఇట్టే తెలిపోతుంది. దీంతో మనం జాగ్రత్త పడవచ్చు. మరి స్కిమ్మర్ మెషిన్లు ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
స్కిమ్మర్ మెషిన్లు మనం కార్డులను స్వైప్ చేసే యంత్రాలను పోలి ఉంటాయి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే స్కిమ్మర్ మెషిన్లను సులభంగా గుర్తించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
1. సాధారణంగా మనం కార్డును స్వైపింగ్ మెషిన్‌లో పెట్టినప్పుడు అందులో చాలా భాగం బయటకు ఉంటుంది. దీంతో ఆ మెషిన్ నిజమైన మెషిన్ అని, స్కిమ్మర్ మెషిన్ కాదని మనకు తెలుస్తుంది. అదే స్కిమ్మర్ మెషిన్ అయితే కార్డు చాలా వరకు లోపలికి పోతుంది. కేవలం కొంత భాగం మాత్రమే బయటకు ఉంటుంది. ఇలా గనక మీకు మెషిన్ కనిపిస్తే వెంటనే కార్డు తీయండి. సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయండి.
2. సాధారణ కార్డు స్వైపింగ్ మెషిన్లతో పోలిస్తే స్కిమ్మర్ మెషిన్లు కొంత వెడల్పు ఎక్కువగా ఉంటాయి.
3. స్కిమ్మర్ మెషిన్లలో కార్డును పెట్టి స్వైప్ చేస్తే మెషిన్ స్క్రీన్ డల్ అవుతుంది. దీన్ని గుర్తిస్తే స్కిమ్మర్ మెషిన్ అవునో కాదో తెలిసిపోతుంది. తద్వారా జాగ్రత్త పడవచ్చు. అయితే అలా ఒక వేళ మెషిన్‌లో కార్డు పెట్టినప్పుడు స్క్రీన్ డల్ అయితే ఆ సమయంలో మన కార్డులోని సమాచారం చోరీకి గురవుతున్నట్టు తెలుసుకోవాలి.
4. అసలైన స్వైపింగ్ మెషిన్‌లో మనం కార్డు పెడితే గ్రీన్ లైట్ వస్తుంది. స్కిమ్మర్ స్వైపింగ్ మెషిన్లలో గ్రీన్ లైట్ రాదు.
5. మన కార్డులో బ్యాలెన్స్ ఉన్నా స్వైప్ చేస్తుంటే ఎర్రర్లు వస్తే అప్పుడు ఆ మెషిన్ ను స్కిమ్మర్ స్వైపింగ్ మెషిన్‌గా అనుమానించాలి. ఈ సందర్భంలో మన కార్డులోని సమాచారం చోరీకి గురవుతుంది.
6. స్వైపింగ్ మెషిన్లకు పెన్ను లాంటి స్టైలస్ ఉంటే అది కచ్చితంగా స్కిమ్మర్ మెషిన్ అయి ఉంటుంది. కనుక మీరు కార్డు స్వైప్ చేసే మెషిన్‌కు స్టైలస్ ఉందో లేదో చెక్ చేస్తే అది స్కిమ్మర్ మెషిన్ అవునో, కాదో గుర్తించవచ్చు. అనంతరం అందుకు తగిన విధంగా జాగ్రత్త పడవచ్చు.
ఇక కార్డు చోరీకి గురైనా, ఇలాగే డూప్లికేట్‌ల బారిన పడ్డా వెంటనే కార్డును బ్లాక్ చేయండి. ఎందుకంటే స్కిమ్మర్ మెషిన్ల ద్వారా కార్డులోని డేటాను మాత్రమే తస్కరించగలరు. డబ్బును కాదు. మీ కార్డు స్కిమ్మింగ్ అయినట్టు భావిస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేయండి. దీంతో ఆ కార్డు ద్వారా జరిగే లావాదేవీలకు బ్రేక్ పడుతుంది. అలాగే ఎక్కడైనా మీ కార్డును స్వైపింగ్ చేస్తే స్వైపింగ్ మెషిన్ వద్ద మీరు కచ్చితంగా ఉండండి. అక్కడి ఉద్యోగులకు, సిబ్బందికి మీ కార్డును ఇవ్వకండి. లేదంటే వారు పైన చెప్పిన విధంగా కార్డులకు డూప్లికేట్‌లను తయారు చేస్తారు. మీరు లేకపోతే వారికి ఆ ప్రాసెస్ ఇంకా సులభతరం అవుతుంది. అదేవిధంగా కార్డు స్వైప్ చేసిన తరువాత బిల్ అమౌంట్ కరెక్ట్‌గా ఉందో, లేదో చెక్ చేసుకోండి. ఇక చివరిగా మీ క్రెడిట్ కార్డుకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. దీంతో దుండగుల చేతుల్లోకి కార్డు వివరాలు వెళ్లి డబ్బు దొంగతనం జరిగినా మీకు ఇన్సూరెన్స్ లభిస్తుంది.