స్మార్ట్ ఫోన్లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు కూడా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. టెలికాం కంపెనీలు తక్కువ ధరకే కాలింగ్, డేటా సదుపాయం అందిస్తుండడం, చాలా వరకు కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేస్తుండడంతో చాలా మంది ఫోన్లను సులభంగా కొని వాడుతున్నారు. రూ.5వేలు పెడితే చాలు, అనేక ఫీచర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేస్తుంది. ఇక ఎవరి స్థోమతకు తగినట్టుగా వారు ఫోన్లను కొని వాడుతుంటారు.
ఆండ్రాయిడ్‌లోనూ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతోపాటు మిడ్‌రేంజ్, ప్రీమియం మిడ్ రేంజ్, ప్రీమియం స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. ఆయా కంపెనీలు భిన్న రకాల ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి వినియెగదారులకు అందిస్తున్నాయి. అయితే సాధారణంగా ఫోన్లను వాడేటప్పుడు మనకు స్క్రీన్‌పై ఒక్కోసారి కొన్ని రకాల చుక్కలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా ఉన్న ఫోన్లలో ఈ చుక్కలను మనం గమనించవచ్చు. అయితే ఈ చుక్కలు ఎందుకు ఉంటాయో గమనించారా..? అదే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు ముందు లేదా వెనుక కెమెరాను ఆ యాప్ వాడుకుంటే అప్పుడు ఫోన్ తెరపై గ్రీన్ కలర్‌లో చుక్క కనిపిస్తుంది. దీన్ని చిత్రంలో చూడవచ్చు. అలాగే మీరు ఓపెన్ చేసిన యాప్ మీ ఫోన్‌కు చెందిన మైక్రోఫోన్‌ను ఉపయోగించుకుంటే అప్పుడు మీ ఫోన్ తెరపై ఆరెంజ్ కలర్‌లో చిన్న చుక్క కనిపిస్తుంది. దీన్ని కూడా మీరు చిత్రంలో చూసి తెలుసుకోవచ్చు. ఇలా మీరు యాప్‌లను ఉపయోగించేటప్పుడు మీకు తెలియకుండా ఏదైనా యాప్ కెమెరా లేదా మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుంది, లేనిది సులభంగా తెలుసుకోవచ్చు. దీంతో ఆ యాప్‌కు కెమెరా, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయకుండా రిస్ట్రిక్షన్ పెట్టవచ్చు. ఇందుకు ఈ ఫీచర్ ఎంతగానో పనిచేస్తుంది. మరి మీ ఫోన్‌లో కూడా ఈ చిన్న చుక్కలు వస్తున్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి.