Tamarind Tree : మనం వంటింట్లో పులుసు కూరలను, చారును, సాంబార్ వంటి వాటిని చింతపండును ఉపయోగించి తయారు చేస్తూ ఉంటాం. చింతపండును ఉపయోగించి చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది చింతపండే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ చింతపండును వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. చింతపండే కాకుండా చింత చిగురు, చింత గింజలు, చింత బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
చింతచెట్టు ఆకుల రసాన్ని లేదా చింత బెరడుతో చేసిన కషాయాన్ని కానీ తీసుకోవడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. పైత్యం తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది. గొంతులో, ఊపిరితిత్తులల్లో పేరుకుపోయిన కఫం, శ్లేష్మం తొలగిపోతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గాయాలు తగిలినప్పుడు లేదా శరీరంలో వాపులు ఉన్న చోట చింత చెట్టు ఆకులను ఉడికించి వాటిని కట్టుగా కట్టడం వల్ల గాయాలు, వాపులు త్వరగా తగ్గుతాయి.
చింతకాయలలో పుల్లటి చింతకాయలతోపాటు తీపి చింతకాయలు కూడా ఉంటాయి. పచ్చి చింతకాయలను, పండు మిరపకాయలను కలిపి చేసే చింతకాయ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చింత చిగురుతో పచ్చడిని, పప్పును, రొయ్యల కూరను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటారు. కాలేయ పని తీరును మెరుగుపరిచి, కాలేయాన్ని బలంగా తయారు చేయడంలో, కామెర్ల వ్యాధిని తగ్గించడంలో, జీర్ణ క్రియను సాఫీగా ఉంచడంలో కూడా చింత చిగురు, చింత చెట్టు ఆకులు, చింత పండు, చింత కాయలు ఉపయోగపడతాయి.
చింతగింజలను కాల్చుకుని తింటే కీళ్లల్లో గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పచ్చి ఉల్లిపాయలను, చింత పండు రసాన్ని వేసి తయారు చేసే పచ్చి పలుసును తీసునడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. మిరియాల పొడిని వేసి చింత పులుసును తినడం వల్ల దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి. చింత పువ్వుతో కూడా పచ్చడిని, పప్పును తయారు చేసుకుని తింటూ ఉంటారు. చింత చెట్టులో ప్రతిభాగం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని.. నిపుణులు చెబుతున్నారు.