Boil Milk : అద్దె ఇంట్లోకి మారాలనుకునే వారు శ్రావణం, భాద్రపదం, ఆషాడం వంటి మాసాల్లో మారితే శుభ ఫలితాలొస్తాయి. అదే విధంగా ఇతర మాసాల్లోనూ పాడ్యమి, పంచమి, విదియ, తదియ, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. వారంలోని ఏడు రోజులలో శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. లక్ష్మీదేవికి అంకితమిచ్చిన ఈ రోజున ఇల్లు మారడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.
బుధవారం, గురువారం కూడా అద్దె ఇంట్లోకి మారొచ్చు. అయితే అత్యవసర పరిస్థితులల్లో శనివారం, ఆదివారం కూడా ఇల్లు మారొచ్చని పండితులు సూచిస్తున్నారు. అయితే సోమవారం, మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి అడుగు పెట్టడం శ్రేయస్కరం కాదని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, సొంతింట్లో ప్రవేశించిన వారు పాలు పొంగించడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. దీని కోసం శుభ ముహుర్తాన్ని సైతం చూస్తారు. కానీ అద్దె ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పాలు పొంగించకూడదని పండితులు చెబుతున్నారు.
అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల సొంతింటి కల నెరవేరే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల సానుకూల శక్తులన్నీ ఆ ఇంటి యజమానికే వెళ్తాయని.. ప్రతికూల శక్తులన్నీ అద్దె ఇంట్లో ఉన్న వారికొస్తాయని పండితులు చెబుతున్నారు. మీరు అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇంట్లో సానుకూల ఫలితాలొస్తున్నాయా.. ప్రతికూల ఫలితాలొస్తున్నాయా… అనే విషయాలను మూడు నెలల లోపే తెలుసుకోవచ్చట.