Mirror For Vastu : అద్దాలను సాధారణంగా ఎవరైనా సరే ప్రతిబింబాలను చూసుకునేందుకు వాడుతారు. కొందరు వీటిని ఇళ్లలో అలంకరణ సామగ్రిగా కూడా ఉపయోగిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నిర్దిష్టమైన ప్రదేశాల్లో అద్దాలను ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో వాస్తు దోషాలు పోవాలంటే అద్దాలను ఏయే చోట్లలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో బేస్‌మెంట్‌లో లేదా నైరుతి దిశలో బాత్‌రూమ్ లేదా టాయిలెట్ ఉంటే అందులో చతురస్రాకారంలో ఉండే అద్దాన్ని తూర్పుకు ఎదురుగా ఏర్పాటు చేయాలి. దీని వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషం పోతుంది. నిర్మాణ పరంగా ఏమైనా వాస్తు దోషాలు ఏర్పడినా అవి తొలగిపోతాయి.
ఇంట్లో ఏ భాగంలోనైనా కూలినట్లు, పగిలినట్లు లేదా చీకటిగా ఉన్నా ఆ ప్రదేశంలో అద్దాన్ని ఏర్పాటు చేయాలి. దీని వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఇంట్లోని వారికి ఆరోగ్యాన్ని, విజయాలను అందిస్తుంది.
ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభం లేదా ఎత్తయిన భవంతి లేదా అవసరం లేని చెట్లు, రాళ్లు ఉన్నా ఇంటి ప్రధాన ద్వారం పక్కన చెక్క ఫ్రేమ్ కలిగిన అద్దాన్ని ఏర్పాటు చేయాలి. దీని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇలా అద్దాలను ఆయా ప్రదేశాల్లో ఉంచడం వల్ల వాస్తు పరంగా ఉండే దోషాలు పోతాయి. సమస్యలు ఉండవు.