బహుళ అంతస్తుల భవన నిర్మాణాల్లో చాలా వరకు అద్దాలను ఎక్కువగా వాడుతుండడం మామూలే. ఇంటీరియర్ డిజైనింగ్‌లోనూ, భవనం అందానికి, ఆకర్షణీయత కోసం ఈ అద్దాలను ఎక్కువగా వాడుతారు. సాధారణ గృహాలు, నివాసాల్లోనూ ఇప్పుడు అద్దాల వాడకం ఎక్కువైపోయింది. ముఖ్యంగా బయటి వైపు, లోపల అద్దాలను ఏర్పాటు చేస్తూ భవనాలకు మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా భవన నిర్మాణాల విషయంలో అద్దాలను మాత్రం కరెక్ట్ ప్లేస్‌లోనే పెట్టాలట. లేదంటే వాస్తు దోషం కలుగుతుందట. దీని వల్ల ఉన్న సంపదంతా పోయి, ఆ భవనంలో నివసించే వారి ఆరోగ్యంగా కూడా చెడిపోతుందట. అయితే మరి, అసలు అద్దాలను భవనాల్లో ఎక్కడ పెట్టకూడదో, ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఇంట్లో నిద్రించే రూంలో మీ బెడ్ ఎదురుగా ఎటువంటి అద్దాలను పెట్టకూడదు. లేదంటే బెడ్‌పై నిద్రించే వారిలోకి నెగెటివ్ శక్తి ప్రసారమై వారికి అనారోగ్యాలు కలగజేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఎలాంటి అద్దాలను బిగించకూడదు. ఇవి ఇంట్లోకి వచ్చే పాజిటివ్ శక్తిని అడ్డుకుని నెగెటివ్ శక్తిని ప్రసారం చేస్తాయి. అది ఆ ఇంట్లో నివసించే వారికి అంత మంచిది కాదు. జీవితంలో వచ్చే అవకాశాలన్నింటినీ కోల్పోతారు. ఇంట్లోని ఏదైనా గదిలో ఉన్న కిటికీ వద్ద అద్దాలను ఉంచుకోవాలి. దీని వల్ల ఇంట్లోకి పాజిటివ్ శక్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఇంట్లోని వారందరికీ ఎంతగానో మేలు చేస్తుంది.
బాత్‌రూంలలో అయితే తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉన్న గోడకు అద్దాలను పెట్టుకోవాలి. దీని వల్ల పాజిటివ్ శక్తి ఉత్పన్నం అవుతుంది. అయితే ఆ ప్రదేశాల్లో ఎదురెదురుగా రెండు అద్దాలను పెట్టకూడదు. ఇది నెగెటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. అద్దం పెట్టిన ప్రదేశంలో దానికి ఎదురుగా పాజిటివ్ శక్తిని ఇచ్చే వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి. నెగెటివ్ శక్తిని ఇచ్చే వస్తువులను పెట్టకూడదు. ఆఫీసుల్లోనైతే బాగా ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో అద్దాలను ఉంచకూడదు. దీని వల్ల నెగెటివ్ శక్తి ఉత్పన్నమవుతుంది. ఆఫీసులోని గదుల్లో ఉండే కిటికీ వద్ద అద్దాలను పెడితే పాజిటివ్ శక్తి ప్రసారమవుతుంది.