క్రికెట్ లో అప్పుడప్పుడు ఫన్నీ సంఘటనలే కాదు, విచారకరమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అయితే తాజాగా జరిగిన సంఘటనలో మాత్రం పెద్దగా నష్టం జరగలేదు. లేదంటే ప్రాణాలే పోయి ఉండేవి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఇండియా, సౌతాఫ్రికా మధ్య జోహన్నెస్ బర్గ్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సౌతాఫ్రికాను ఇండియా చిత్తు చేసింది. 135 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాకు టీ20లలో ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. కాగా మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్ సమయంలో భారత బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ కొట్టిన ఓ సిక్స్‌కు గాను ఓ మహిళకు గాయమైంది.
10వ ఓవర్‌లో సంజూ శాంసన్ ఓ పవర్ ఫుల్ సిక్స్ కొట్టాడు. మిడ్ వికెట్ మీదుగా కొట్టిన ఆ సిక్స్‌కు స్టేడియంలో గ్యాలరీలో కూర్చున్న ఓ మహిళ ముఖానికి ఆ బంతి తాకింది. దీంతో వెంటనే సంజూ శాంసన్ అది చూసి ఆమెకు సారీ చెబుతున్నట్లు చేయి ఊపాడు. అయితే ఆమెకు వెంటనే వైద్యులు చికిత్స అందించారు. ఆమెకు ప్రాణాపాయం ముప్పు తప్పినట్లు తెలిసింది. కానీ ఆ సమయంలో కెమెరాలన్నీ ఆ దృశ్యాలను బంధించడంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇక చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ విజృంభణతో 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేయగా సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో రాణించారు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇలా ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు బాదడం ఇదే తొలిసారి కాగా.. 2వ వికెట్‌కు ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 210 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇది కూడా ఓ రికార్డు కావడం విశేషం. ఇక బౌలింగ్‌లోనూ భారత్ అదరగొట్టింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో ఓ దశలో సౌతాఫ్రికా 4 వికెట్లను కోల్పోయి 10 పరుగుల వద్ద కొనసాగింది. కానీ వికెట్లను కోల్పోతునూ ఉండడంతో ఆ జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక భారత్ నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ మ్యాచ్‌ల ను ఆడనుంది.