వారెవరో కాదు. సాక్షాత్తు రైల్వే అధికారులే! ఎందుకంత భయపడ్డారు తెలుసా? ఆ గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే , దాని ఇష్టంగా గం॥ కు 100 కి. మీ. వేగం తో వెళ్తుంటే, ఎవరికి మాత్రం గుండెలదరదు? ఫిబ్రవరి, 25 న జమ్మూ కాశ్మీర్ లోని కత్వా రైల్వే స్టేషన్ లో డ్యూటీ మారడానికి లోకో పైలట్ , అసిస్టెంట్ లోకో పైలట్లు ప్లాట్ ఫారం పై దిగారు. హాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయారు. అక్కడ పట్టాలు ఉన్న భూమి వాలుగా ఉండడం తో గూడ్స్ రైలు తనంత తానే కదిలిపోయింది.
అలా ఎక్కడా ఆగకుండా వెళ్తూనే ఉంది. ఒక సమయం లో గం॥ కు 100 కి. మీ. వేగంలో వెళ్లిందట. రైల్వే అధికారిలందరికీ ముచ్చెమటలు పట్టించింది. చివరకు 70 కి. మీ. దూరంలో పంజాబ్ లోని హోషియార్పూర్ సమీపంలోని ఊంజీబస్సీ స్టేషన్ లో, పట్టాలపై ఇసుకబస్తాలు వేసి ట్రైన్ ను ఆపగలిగారట.
ఒకటి, రెండు గంటలు ఆ గూడ్స్ ట్రైన్ కోసం ముందు ఉన్న స్టేషన్ మాస్టర్లు అందరిని అలర్ట్ చేసి, దానికి ఏ ట్రైన్లు అడ్డం రాకుండా లైన్లు క్లియర్ చేయడం, దానిని ఆపడానికి నిర్దేశించుకున్న స్టేషన్ లో ఎమర్జెన్సీ గా పట్టాలపై ఇసుక బస్తాలు వేసి, లోకో పైలట్ల ను సిద్ధం చేసి ఉంచడం, చివరికి ట్రైన్ ను ఆపగలగడం, ఏ సినిమా క్లైమాక్స్ కు తక్కువ కాదు. ఈ ఘటన పై ఎంక్వైరీ కి రైల్వే అధికారులు ఆదేశించారు.