థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు..!

మన శరీరంలో ఉన్న అనేక గ్రంథుల్లో థైరాయిడ్‌ గ్రంథి ఒకటి. ఇది అనేక జీవక్రియలను నియంత్రిస్తుంది. శారీరక ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు సరిగ్గా లేకపోతే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా.. కింద తెలిపిన రెండు ఆసనాలను రోజూ వేయాల్సి ఉంటుంది. దీంతో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆసనాలు ఏమిటంటే..

థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మేలు..!

హలాసనం

వెల్లకిలా పడుకుని కాళ్లను నెమ్మదిగా పైకి లేపుతూ 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. చేతులు శరీరానికి రెండు వైపులా నేలపై ఆనించాలి. చేతుల సహాయంతో వీపును కటి ప్రదేశం వరకు పైకెత్తాలి. వీపును నడుము వరకు నిట్ట నిలువుగా ఉంచాలి. గడ్డాన్ని కంఠానికి తాకేలా (తల ఎత్తకుండా) చేయాలి. భుజాలపై శరీర భారాన్ని ఉంచుతూ నడుము నుంచి కాళ్ల వరకు వంచాలి. కాళ్లను తల వెనుక నేలపై తాకించాలి. ఈ స్థితిలో మీ కాళ్లను ఎట్టి పరిస్థితిలోనూ కిందకు వంచరాదు. చేతులను నేలపై వెల్లకిలా ఉంచాలి. ఈ స్థితిలో 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉండవచ్చు. ఈ ఆసనం వేసేటప్పుడు శ్వాస మామూలుగా తీసుకోవాలి.

హలాసనం ఉపయోగాలు

ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్‌ సమస్య చాలా వరకు తగ్గుతుంది. గ్యాస్ట్రిక్‌, మలబద్దకం, అజీర్ణం సమస్యలు దరి చేరవు. రుతు క్రమం సరిగ్గా ఉంటుంది. మూత్ర పిండాలు, గర్భాశయం పటిష్టంగా మారుతాయి. లైంగిక శక్తి పెరుగుతుంది. శ్వాస సంబంధ వ్యాధులు, మూత్ర సమస్యలు తగ్గుతాయి. కాళ్లు, భుజాలు బలోపేతం అవుతాయి.

జాగ్రత్తలు

స్పాండిలైటిస్‌, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. సయాటికా, హెర్నియా, నడుము నొప్పి ఉన్నవారు కూడా ఈ ఆసనం వేయరాదు.

మత్స్యాసనం

పద్మాసనంలో కూర్చుని మోచేతుల సహాయంతో వెనుకకు వాలుతూ తలను నేలకు ఆన్చాలి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలి బొటన వేలును, ఎడమ చేత్తో కుడి కాలి బొటన వేలును పట్టుకోవాలి. ఈ ఆసనంలో 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు ఉండే ప్రయత్నం చేయాలి. తరువాత చేతుల్ని నేల మీద ఆన్చి యథాస్థితికి రావాలి.

మత్స్యాసనం ఉపయోగాలు

థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. రుతుక్రమం సరిగ్గా ఉంటుంది. వెన్నెముక, తుంటి భాగాలకు, గర్భాశయానికి మేలు జరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

Share
Admin

Recent Posts