మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల సంకోచ వ్యాకోచాలకు కూడా కాల్షియం ఉపయోగపడుతుంది. ఎముకల్లో కాల్షియం తగ్గితే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. దీంతో అనేక రకాల నొప్పులు వస్తాయి.
శరీరంలో కాల్షియం తగ్గితే ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. అలాగే హైబీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లల్లో కాల్షియం తగ్గితే పెరుగుదల సరిగ్గా ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కాల్షియం రోజూ అందేలా చూసుకోవాలి. ఇక గర్భిణీలు కాల్షియం తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. ఇందుకు గాను డాక్టర్లు వారికి ట్యాబ్లెట్లను కూడా ఇస్తుంటారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది.
మనం రోజూ తినే అనేక ఆహారాల్లోనూ కాల్షియం ఉంటుంది. గోధుమలు, ముడి బియ్యం, ఆలుగడ్డలు తదితరాల్లో కాల్షియం లభిస్తుంది. కానీ వీటిలో కాల్షియం తక్కువగా ఉంటుంది. కనుక కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ పోషక పదార్థ లోపాన్ని అరికట్టవచ్చు.
సోయా, కొత్తిమీర, మెంతులు, బెల్లం, పాలు, నువ్వులు, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, రాగులు, మినుములు, ఉలవలు, తోటకూర, క్యారెట్, కాలిఫ్లవర్, కరివేపాకు, పుదీనా, పసుపు, గోంగూర, ధనియాలు, జీలకర్ర, చేపలు, జున్ను, కోడిగుడ్లు, చిలగడదుంపలు, కొబ్బరి వంటి పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల మనకు కాల్షియం ఎక్కువగా లభిస్తుంది.
కాఫీ, ఉప్పు, మద్యం వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. కనుక ఆయా పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి.
కాల్షియం లోపం ఉంటే డాక్టర్ సూచన మేరకు ట్యాబ్లెట్లను వాడవచ్చు. కాల్షియం ట్యాబ్లెట్ల డోసు మించితే కడుపు ఉబ్బరం, వికారం, మలబద్దకం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి కనుక జాగ్రత్తగా వాడుకోవాలి.
ఖాళీ కడుపుతో కాల్షియం ట్యాబ్లెట్లను వేసుకోరాదు. రోజుకు 1000 నుంచి 1500 మిల్లీగ్రాముల మేర మాత్రమే మనకు కాల్షియం అవసరం అవుతుంది. అందువల్ల దాన్ని మోతాదులో మాత్రమే తీసుకోవాలి. విటమిన్ డి తక్కువగా ఉంటే సహజంగానే కాల్షియం కూడా తక్కువగా ఉంటుంది. కనుక వారు కూడా పరీక్షలు చేయించుకుని అవసరం అయితే ట్యాబ్లెట్లను వాడవచ్చు.
కాల్షియం లోపిస్తే చిన్నారులలోనే కాదు, పెద్దల్లోనూ అనేక ఎముకల సమస్యలు వస్తాయి. కనుక కాల్షియం లోపం ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. కాల్షియం లోపించిన వారిలో కండరాలు పట్టుకుపోతుంటాయి. కీళ్లు, కండరాల నొప్పులు వస్తుంటాయి. తీవ్రమైన అలసటగా ఉంటుంది. చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. కనుక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. కాల్షియం ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి.