Yoga : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు సమస్యతో సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని తగ్గించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయితే సరైన ప్రకారం చేస్తే అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవడం సులభమే అని చెప్పవచ్చు.
యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. ఎవరైనా సరే తమకు అనుగుణంగా సౌకర్యవంతంగా తమకు ఉన్న వ్యాధులను తగ్గించుకునేందుకు వీలుండే ఆసనాలను రోజూ వేస్తుంటారు. ఇక పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే ఆసనాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మేం చెప్పబోయే ఆసనం కూడా ఒకటి. అదేమిటంటే..
ఏకపాద అథోముఖ స్వనాసన.. దీని గురించి చాలా మంది విని ఉండరు. కానీ ఇది యోగాలో ఒక ఆసనం. దీన్ని వేయడం చాలా సులభమే. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నేలపై ముందుగా నిటారుగా నిలబడాలి. ముందుకు వంగి అరచేతులను నేలపై ఉంచాలి. రెండు అరచేతుల మధ్య దూరం ఉండాలి. ఇప్పుడు ఒక కాలుని గాలిలో వీలైనంత వరకు పైకెత్తి అలాగే ఉంచాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. తరువాత గాలిలో ఉన్న కాలును కిందకు దించాలి. అనంతరం రెండో కాలుని పైకెత్తి అలాగే చేయాలి. ఇలా ఈ ఆసనాన్ని రోజూ సౌకర్యవంతంగా ఉండే వరకు వేయవచ్చు.
ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా చేతులు, పొట్ట, తొడల కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఆయా భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరం చక్కని ఆకృతిలోకి వస్తుంది.
ఈ ఆసనం వేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నడిచేటప్పుడు, ఇతర పనులు చేసేటప్పుడు నేలపై బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. చక్కగా నడవగలుగుతారు.
ఇక ఈ ఆసనాన్ని హైబీపీ పేషెంట్లు, తీవ్రమైన చేతి, కాలి నొప్పులు ఉన్నవారు వేయరాదు.