Krithi Shetty : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటిస్తే అది హిట్ అయి బ్రేక్ రావడం చాలా కష్టం. కానీ వచ్చాక మాత్రం వెనుకకు తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. ఎన్నో ఆఫర్లు వస్తుంటాయి. వాటిని అంది పుచ్చుకుని ముందుకు సాగితే ఒక సినిమా కాకపోయినా మరొక సినిమా హిట్ అవుతుంది. దీంతో కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ ఆరంభంలోనే వచ్చిన ఆఫర్లను తిరస్కరిస్తే అప్పుడు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అలాగే చేస్తుందని అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీస్ తెరకెక్కిస్తోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఒక హీరోయిన్‌గా ఇప్పటికే శృతి హాసన్‌ను ఎంపిక చేశారు. ఇక మరొక హీరోయిన్ కోసం కృతి శెట్టిని తీసుకోవాలని అనుకున్నారట. అందుకనే ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించిందట. కానీ ఆమె ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది.
తన కెరీర్ ఇప్పుడే ప్రారంభంలో ఉంది కనుక ఈ సమయంలో సీనియర్ హీరోలతో నటిస్తే తన కెరీర్ ప్రమాదంలో పడుతుందేమోనని కృతి శెట్టి ఆలోచిస్తున్నదట. అందుకనే బాలకృష్ణతో నటించేందుకు ఆమె నో చెప్పినట్లు సమాచారం. దీంతో చిత్ర యూనిట్ ఇంకో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. అయితే సీనియర్ హీరోకు నో చెప్పినందుకు కృతి శెట్టి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.