Ravi Teja : కరోనా సమయంలో చాలా వరకు సినిమాలు ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. బాలీవుడ్‌లోనైతే ముఖ్యమైన హీరోల సినిమాలను కూడా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ అనేక సినిమాలు ఇంకా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే తెలుగు సినిమాల పరిస్థితి మాత్రం వేరే. ఈ మధ్య కాలంలో ఓటీటీల కన్నా థియేటర్లలోనే ఎక్కువ సినిమాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ రవితేజకు మాత్రం పరిస్థితి ఏమాత్రం బాగాలేదని తెలుస్తోంది.
రవితేజ నటించిన ఖిలాడి మూవీ ఈ మధ్యే విడుదల కాగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆయన తరువాతి సినిమా రామారావు ఆన్ డ్యూటీని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ఖిలాడి సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు రామారావు ఆన్ డ్యూటీ సినిమాను చాలా తక్కువకు అడుగుతున్నారట. దీంతో అంత తక్కువ ధరకు ఇవ్వలేమని నిర్మాత చెబుతున్నారట.
అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచి ధరే ఇస్తామని చెప్పారట. దీంతో ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అదే జరిగితే రవితేజ కెరీర్‌లో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయిన మూవీ ఇదే అవుతుంది. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోయినా.. చిన్న సినిమాలు సైతం థియేటర్లలోనే విడుదలవుతున్నాయి. కానీ రవితేజ లాంటి పెద్ద హీరో సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే.. ఆయనకు ఇది మైనస్ అనే చెప్పాలి.
ఇక రామారావు ఆన్ డ్యూటీ సినిమా స్ట్రీమింగ్ పార్ట్‌నర్ సోనీ లివ్ అంటూ మేకర్స్ ఇప్పటికే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు రవితేజ అంగీకరించారా ? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.