కారం అంటే సహజంగానే మన దేశంలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. అనేక మంది కారం ఉన్న ఆహారాలను కోరుకుంటుంటారు. ఇక కొందరికి అయితే సాధారణ కారం సరిపోదు. దీంతో అలాంటి వారు ఒక రేంజ్‌లో నిత్యం కారం తింటుంటారు. అయితే కొందరు మాత్రం కూరలు కారంగా ఉన్నాయని ముందుగా తెలియకపోవడం వల్ల కారం తింటారు. ఇక కొందరు అయితే తప్పనిసరి అయి తింటారు. మరికొందరు కావాలనే కారం తింటారు. అయితే ఎలా తిన్నా సరే.. కారం ఉండే కూరలు, ఇతర పదార్థాలను తింటే మన జిహ్వా చాపల్యం తీరుతుంది. నోట్లో కొంత సేపు మాత్రమే కారం ఫీలింగ్‌ను అనుభవిస్తాం. కానీ ఆ కారం జీర్ణాశయంలోకి వెళితే.. అప్పుడది రివర్స్ అయితే.. అప్పుడు ఉంటుంది మజా. అప్పుడు కలిగే బాధను వర్ణించలేం.
కారంతోపాటు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తిన్నంత వరకు బాగానే ఉంటాయి. కానీ తిన్నాక పడకపోతే కడుపులో అలజడి మొదలవుతుంది. కొందరికి విరేచనాలు అవుతాయి. ఇంకొందరికి తీవ్రమైన మంట కలుగుతుంది. కొందరికి విపరీతమైన గ్యాస్ వస్తే, ఇంకొందరికి అజీర్తి మొదలవుతుంది. ఇలా కారం రక రకాల ఎఫెక్ట్‌లను చూపిస్తుంది. అయితే కారం కలిగించే ఈ ఇబ్బందులను సులభంగా తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
కారం తిన్నాక అది పడకపోతే పైన తెలిపిన ఇబ్బందులు మొదలైనట్లు అనిపిస్తే సమస్య ఇంకా తీవ్రతరం కాకముందే కింద చెప్పిన చిట్కాలు పాటించాలి. దీంతో ఆయా సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
* కారం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించేందుకు పాలు అమోఘంగా పనిచేస్తాయి. అయితే వెన్న తీయని హోల్ మిల్క్‌ను తాగాలి. గోరు వెచ్చగా ఉన్న పాలను తాగడం వల్ల కడుపులో కారం వల్ల కలిగే అలజడి తగ్గుతుంది. కారం.. అంటే మిరపకాయలు, ఎండుకారంలో ఉండే క్యాప్సెయిసిన్‌ను పాలు తటస్థం చేస్తాయి. దీంతో కారం వల్ల ఇబ్బందులు తప్పుతాయి.
* కారం తిన్నాక దాని వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఒక టీస్పూన్ చక్కెర లేదా 2 టీస్పూన్ల తేనె తీసుకోవచ్చు. దీంతో కారంలోని సమ్మేళనాల ప్రభావం తగ్గుతుంది. సేఫ్‌గా ఉండవచ్చు.
* కారం తిన్నతరువాత ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్‌ను కూడా తీసుకోవచ్చు.
* ఆమ్ల స్వభావం కలిగిన నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తినడం వల్ల కూడా కారం ప్రభావం తగ్గుతుంది.