కొల్లెస్టరాల్ తగ్గాలంటే జంతు సంబంధిత కొవ్వులు తినరాదని డాక్టర్లు, పోషకాహార నిపుణులు ఎపుడో తెలిపారు. కాని డెన్మార్క్ దేశపు రీసెర్చర్లు జున్ను శరీరంలో చెడు కొల్లెస్టరాల్ కలిగించదని తమ అధ్యయనంలో వెల్లడించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన స్టడీ మేరకు ప్రతిరోజూ ఒక సారి చొప్పున ఆరు వారాలపాటు జున్ను తిన్నప్పటికి దాని ప్రభావం అదే మాదిరి వెన్న తిన్న వారిలో ఏర్పడిన చెడు కొల్లెస్టరాల్ కంటే అతి తక్కువగా వుందని తెలిపింది.
ఈ అధ్యయనం కోపెన్ హేజెన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ జూలీ జెర్పెస్ట్ అతని సహచరులు నిర్వహించారు. వీరు సుమారు 50 మందిని సర్వే చేశారు. వీరికి వారు ప్రతిరోజూ తినే కొవ్వులో 13 శాతం జున్ను ఇచ్చారు. సాధారణ భోజనంలో తినేదానికంటే అధిక కొవ్వు తిన్నప్పటికి, జున్ను తిన్న వీరిలో చెడు కొల్లెస్టరాల్ ఏ మాత్రం పెరగలేదని, అదే మొత్తంలో వెన్న తిన్న వారిలో సగటున 7 శాతం అధిక చెడు కొల్లెస్టరాల్ ఏర్పడిందని పరిశోధన తెలిపింది.
అయితే జున్ను ఆరోగ్యకరమే అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తినాలని వారు సూచిస్తున్నారు. ఇతర పాల ఉత్పత్తుల కన్నా జున్నును తినడం ఎంతో మేలని వారు చెబుతున్నారు. కొవ్వు చేరుతుందనే భయం ఉంటే జున్ను తినడం మంచిదని వారు సూచిస్తున్నారు.