Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఓ వైపు భారత క్రికెట్ జట్టు నుంచి అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ధోనీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ఈ సీజన్ ధోనీకి ఆఖరిదని అంటున్నారు. ఈ క్రమంలోనే ధోనీ తరువాత చెన్నై టీమ్‌కు ఎవరు కెప్టెన్సీ వహిస్తారు ? అనే ప్రశ్నలు తరచూ వస్తున్నాయి. అయితే దీనికి చెన్నై మాజీ ప్లేయర్ సురేష్ రైనా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.

చెన్నై జట్టులో అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రేవో.. ఇలా కెప్టెన్సీకి అర్హులైన ప్లేయర్లు ఉన్నారు. వీరు టీమ్‌ను చాలా బాగా లీడ్ చేయగలరు. అయితే వీరికన్నా రవీంద్ర జడేజా అయితే ఇంకా మంచిది. జడేజాకు అన్ని విషయాలు తెలుసు. ధోనీలా జట్టును దగ్గరుండి నడిపించే సత్తా.. జట్టుకు విజయాలను అందించే సామర్థ్యం.. అన్నీ జడేజాలో ఉన్నాయి. కనుక ధోనీ తరువాత రవీంద్ర జడేజానే కెప్టెన్ అయితే బాగుంటుంది.. అని సురేష్ రైనా తెలిపాడు. ఈ మేరకు రైనా ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇక సురేష్ రైనా గత సీజన్ ఐపీఎల్ వరకు చెన్నై జట్టుకే ఆడాడు. కానీ ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మెగా వేలంలో చెన్నై జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు. దీంతో రైనా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే ఓ దశలో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని కొనుగోలు చేస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలోనే రైనా ఈసారి ఐపీఎల్‌లో తొలిసారిగా కామెంటరీ చెప్పబోతున్నాడు. రవిశాస్త్రితో కలిసి ఎలైట్ కామెంటరీ ప్యానెల్‌లో రైనా కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే తనకు కామెంటరీ చెప్పడం రాదని.. అయినప్పటికీ తన తోటి మాజీ ప్లేయర్లు ఇప్పటికే కామెంటరీ చెబుతున్నారు కనుక వారి సలహాలు తీసుకుని ఈ ఫీల్డ్‌లో ముందుకు సాగుతానని రైనా తెలిపాడు.