Multi Dal Dosa : మనం దోశలను ఎక్కువగా మినప పప్పుతో లేదా పెసలతో తయారు చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక పప్పుతో మాత్రమే దోశలను తయారు చేస్తుంటాం. కానీ వివిధ రకాల పప్పులను, చిరు ధాన్యాలను కలిపి మల్టీ దాల్ దోశను తయారు చేసుకోవచ్చు. ఈ దోశ ఎంతో రుచిగా ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మల్టీ దాల్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలను, తయారీ విధానం గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
మల్టీ దాల్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, మినప పప్పు – పావు కప్పు, రాగులు – పావు కప్పు, కందిపప్పు – పావు కప్పు, పెసర పప్పు – పావు కప్పు, పెసలు – పావు కప్పు, అటుకులు – పావు కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, అల్లం – చిన్న ముక్క, పచ్చి మిర్చి – 4, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – ఒక కప్పు.
మల్టీ దాల్ దోశను తయారు చేసుకునే విధానం..
ముందుగా బియ్యం, మినప పప్పు, రాగులు, కందిపప్పు, పెసర పప్పు, పెసలు, అటుకులు, మెంతులను కలిపి ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడిగిన తరువాత, తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఒక జార్ లో ముందుగా నానబెట్టుకున్న పప్పులతోపాటుగా అల్లం, పచ్చి మిర్చిని కూడా వేసి దోశ పిండిలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక రాత్రి అంతా లేదా 7 నుంచి 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి.
ఈ మిశ్రమం పులిసిన తరువాత రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంపై ఈ మిశ్రమాన్ని దోశలా వేసుకోవాలి. కొద్దిగా నూనెను వేసి రెండు దిక్కులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మల్టీ దాల్ దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అనేక పోషకాలను ఒకేసారి పొందవచ్చు. దీంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.