Lemon Juice : నిమ్మకాయలు మనకు అందించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వీటిల్లో ఉండే విటమిన్ సి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను రాకుండా రక్షిస్తుంది. ఇంకా మనకు నిమ్మకాయల వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే నిమ్మరసం తాగే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసాన్ని రోజూ తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే రోజులో నిమ్మరసాన్ని ఎప్పుడు తాగాలి ? అనే సందేహం కొందరికి కలుగుతుంది. అయితే నిమ్మరసాన్ని రోజులో మీకు ఇష్టం వచ్చిన సమయంలో తాగవచ్చు. కానీ ఉదయాన్నే పరగడుపునే తాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల కిడ్నీ స్టోన్లు రాకుండా ఉంటాయి. అలాగే ఈ రసంలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. దీంతోపాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. కనుక నిమ్మరసాన్ని ఉదయం పరగడుపున తాగితేనే మంచిది. అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవాలన్నా.. నిమ్మరసాన్ని పరగడుపునే తాగాలి.
ఇక నిమ్మరసాన్ని ఎంత మొత్తంలో తాగాలి ? అనే సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది. నిమ్మరసాన్ని రోజుకు 2 టీస్పూన్ల వరకు తీసుకోవచ్చు. అంటే ఒక మీడియం సైజ్ ఉన్న నిమ్మకాయ నుంచి 1 టీస్పూన్ రసం వస్తుందనుకుంటే.. రెండు నిమ్మకాయల నుంచి వచ్చే రసాన్ని రోజూ తీసుకోవచ్చన్నమాట. అయితే కొన్ని నిమ్మకాయల్లో ఇంకా ఎక్కువ రసం వస్తుంది. కనుక అలాంటి కాయలు అయితే.. ఒక్క కాయ చాలు. ఇలా నిమ్మరసాన్ని రోజూ తాగాలి. ఇక నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది.