Barley Laddu : బార్లీ గింజల వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ గింజలను నానబెట్టి నీటిలో మరిగించి ఆ నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. వేసవిలో శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అలాగే మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. అయితే బార్లీ గింజలతో లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. మనకు పోషకాలను, శక్తిని అందిస్తాయి. ఇక వీటితో లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బార్లీ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
బార్లీ గింజలు – ఒక కప్పు, చక్కెర – ఒక కప్పు, వేడి చేసి చల్లార్చిన పాలు – పావు కప్పు, నెయ్యి -2 టీస్పూన్లు, జీడిపప్పు – పావు కప్పు, కిస్మిస్ – పావు కప్పు, యాలకుల పొడి – పావు టీస్పూన్.
బార్లీ లడ్డూ తయారు చేసే విధానం..
బార్లీ గింజలను దోరగా వేయించి తీసి చల్లారనివ్వాలి. తర్వాత బార్లీతోపాటు చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి కాగాక అందులో జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ వేయించాలి. అందులోనే బార్లీ మిశ్రమం, యాలకుల పొడి, పాలు కూడా వేసి బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. లడ్డూల తయారీకి అవసరం అయ్యే మిశ్రమంలా కలుపుకోవాలి. ఒకవేళ మిశ్రమం రాకపోతే మరికొన్ని పాలను వేడి చేసి చల్లార్చి కలుపుకోవచ్చు. ఇలా మిశ్రమం తయారు చేసుకుని అది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలలా తయారు చేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన బార్లీ లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒక్కటి తిన్నా చాలు.. ఎన్నో లాభాలు కలుగుతాయి.