Pudina Rice : మనం ఎక్కువగా పుదీనాను వంటలు చేసిన తరువాత గార్నిష్ చేయడంలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ పుదీనా కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనాలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. అజీర్తి సమస్యను తగ్గించడంలో పుదీనా ఎంతో సహాయపడుతుంది. పుదీనాను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడడంతోపాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలిచ్చే తల్లులలో రొమ్ము నొప్పిని తగ్గించడంలో పుదీనా ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. పుదీనాను మనం ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుదీనాతో మనం రకరకాల ఆహార పదార్థాలను, జ్యూస్ లను తయారు చేయవచ్చు. పుదీనాతో చేసే ఆహార పదార్థాలలో భాగంగా ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – పావు కిలో బియ్యంతో వండినంత, పుదీనా కట్ట – ఒకటి (మధ్యస్థంగా ఉన్నది), అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 7 లేదా 8, పచ్చి మిర్చి కాయలు – 2, లవంగాలు – 4, దాల్చిన చెక్క ముక్కలు – 2 (చిన్నవి).
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, తరిగిన పచ్చి మిరపకాయలు – 2, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పుదీనా రైస్ తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పొడిగా, చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. తరువాత పుదీనా ఆకులను తెంచి, శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో పక్కకు పెట్టుకున్న పుదీనా ఆకులతోపాటు మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక పల్లీలను వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక పసుపు, ఉప్పు, కొత్తిమీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలన్నింటినీ వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా చల్లార బెట్టుకున్న అన్నాన్ని వేసి పుదీనా మిశ్రమం అన్నాన్నికి పట్టేలా బాగా కలిపి, మూత పెట్టి, మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు ఉంచాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్ తయారవుతుంది. రోజూ తినే అన్నాన్నికి బదులుగా అప్పుడప్పుడు ఇలా పుదీనా రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. కూర చేసే సమయం లేనివారు లంచ్ బాక్స్ లోకి కూడా ఇలా పుదీనా రైస్ ను తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.