Brushing : మనలో చాలా మంది ఉదయం బ్రష్ చేసుకునేటప్పుడు గొంతులో పేరుకుపోయిన కఫాన్ని, శ్లేష్మాన్ని తొలగించుకోవడానికి, అలాగే కడుపులో ఉండే రసాలను (పసరు) తొలగించుకోవడానికి నోట్లో వేళ్లను పెట్టి మరీ కక్కుతూ ఉంటారు. కొందరికి ప్రతిరోజూ ఆ విధంగా చేయనిదే బ్రష్ చేసినట్టుగా ఉండదు. కొందరు ఉదయం పూట ఎక్కువగా నీటిని తాగి నోట్లో వేళ్లను పెట్టుకుని కక్కుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గొంతులో పేరుకు పోయిన కఫాలు, శ్లేష్మాలతోపాటు పొట్టలో నిల్వ ఉండే రసాలు కూడా తొలగిపోతాయి. కానీ ఈ విధంగా బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని ప్రతిరోజూ కక్కడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల గొంతు, పొట్ట, ప్రేగులు అధిక ఒత్తిడికి గురవుతాయని వారు చెబుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా గొంతులో ఉండే నరాలు చిట్లే అవకాశం ఎక్కువగా ఉందని, అంతే కాకుండా ప్రేగులపై కలిగే ఈ అధిక ఒత్తిడి కారణంగా ప్రేగులపై ఉండే పొర పగిలి ప్రేగులు బయటికి రావడం (హెర్నియా) వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టుకుని కక్కడం వంటివి ప్రతి రోజూ చేయకూడదని వికారం, అజీర్తి కారణంగా తలనొప్పి వచ్చినప్పుడు మాత్రమే పొట్టలోని ఆహార పదార్థాలను బయటకు పంపించేందుకు ఇలా చేయాలని నిపుణులు చెబుతున్నారు.
గొంతులో పేరుకుపోయిన కఫాన్ని , శ్లేష్మాన్ని తొలగించుకునేందుకు వేపపుల్లతో బ్రష్ చేసుకోవాలని, ఇలా చేయడం వల్ల వేపలో ఉండే చేదు కారణంగా జిగురు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని.. ఇలా ఉత్పత్తి అయిన జిగురు కఫాన్ని తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రష్ చేసుకునేటప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని కక్కడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. కనుక ఎట్టి పరిస్థితిలోనూ ఇలా చేయవద్దని వారు అంటున్నారు.