Prawns Biryani : మనం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పత్తులల్లో రొయ్యలు ఒకటి. రొయ్యలతో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. రొయ్యలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రొయ్యలలో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బి గ్రూప్ కు చెందిన విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రొయ్యలలో ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి సహాయపడతాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధితమైన సమస్యలతో బాధపడుతున్నారు. రొయ్యలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో అధికంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధమైన సమస్యలు రాకుండా చేయడంలో ఎంతో సహాయపడతాయి.
చికెన్, మటన్ లను తినడం వల్ల కొందరిలో అజీర్తి, శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలను మనం చూడవచ్చు. అయితే రొయ్యలు చాలా త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇక రొయ్యలతో చేసే వంటకాలలో రొయ్యల బిర్యానీ ఒకటి. ఎంతో రుచిగా ఉండే రొయ్యల బిర్యానీని చాలా సులువుగా, చాలా తకకువ సమయంలోనే మనం ఇంట్లోనే వండుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – 400 గ్రా., పచ్చి రొయ్యలు – 400 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 2 (మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత.
మసాలా దినుసులు..
బిర్యానీ ఆకు – ఒకటి, సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 5, యాలకులు – 3, దాల్చిన చెక్క ముక్కలు – 3, అనాస పువ్వు – 1.
రొయ్యల బిర్యానీ తయారీ విధానం..
ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత రొయ్యలను కూడా 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మసాలా దినుసులను, తరిగిన పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. తరువాత కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించాలి. వీటిలో ఉండే నీరు అంతా పోయి రొయ్యలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాట ముక్కలను వేసి వేయించాలి. ఇవి పూర్తిగా వేగాక పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
తరువాత ఒక కప్పు బాస్మతి బియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్ల చొప్పున తగినన్ని నీళ్లను పోయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత నాన బెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని, తరిగిన కొత్తిమీర వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉంచి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా సులువుగా, ఎంతో రుచిగా ఉండే రొయ్యల బిర్యానీ తయారవుతుంది. పచ్చి ఉల్లిపాయ, నిమ్మరసంతో కలిపి తింటే.. రొయ్యల బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది.