Athipatti Mokka : ప్రకృతిలో ఎన్నో విలక్షణమైన గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. ఇలాంటి వాటిలో అత్తిపత్తి మొక్క ఒకటి. మనలో చాలా మందికి అత్తి పత్తి మొక్క గురించి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఆకులను తాకగానే ముడుచుకుపోతాయి. దీనిని సిగ్గాకు, నిద్ర గన్నిక అని కూడా పిలుస్తూ ఉంటారు. తేమ ప్రదేశాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. అత్తి పత్తి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క ఔషధ గుణాల గురించి తెలిస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే. ఈ మొక్క పాబేసే జాతికి చెందిది. దీని శాస్త్రీయ నామం మైమోసా ప్యూడిక. ప్యూడిక అంటే లాటిన్ భాషలో సిగ్గు అని అర్థం. ఈ మొక్కను ఇంగ్లిష్ లో టచ్ మి నాట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకులు సూర్యాస్తమయం కాగానే ముడుచుకుని సూర్యోదయం కాగానే విచ్చుకుంటాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది అత్తిపత్తి మొక్కలను ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. అత్తి పత్తి మొక్క ఎందుకు ఇలా ముడుచుకుపోతుందో చాలా మందికి తెలియదు. మనం తాకినప్పుడు, కదిలించినప్పుడు, ఏదైనా కీటకం వాలినప్పుడు, గాలి వీచినప్పుడు తనని తాను రక్షించుకోవడానికి గాను ఈ మొక్క ఆకులు ముడుచుకుపోతాయి. ఇలా ముడుచుకున్న ఆకులు యథాస్థితికి రావడానికి గాను అర గంటకు పైగానే సమయం పడుతుంది. ఈ మొక్క కాండానికి, ఆకులకు మధ్య బుడిపెలు ఉంటాయి. మనం తాకగానే ఈ బుడిపెలలో ఉండే నీరు కాండంలోకి వెళ్తుంది. ఫలితంగా కాండం దృఢత్వాన్ని కోల్పోయి ఆకులు ముడుచుకుపోతాయి. చాలా సమయం తరువాత కాండంలో ఉండే నీరు మళ్లీ బుడిపెలలోకి చేరి ఆకులు విచ్చుకుంటాయి.
అంతే కాకుండా ఈ మొక్క ఆకుల కింద నీటి సంచులు ఉంటాయి. మనం తాకగానే నీటి సంచుల్లో ఉండే నీరు కిందికి జారిపోతుంది. దీంతో ఆకులు ముడుచుకుపోతాయి. కొద్ది సమయం తరువాత నీటి సంచుల్లోకి నీరు చేరి ఆకులు యథాస్థితికి వస్తాయి. ఆవులు, గేదెలు వంటి జంతువులు తినడానికి ప్రయత్నించగానే ఈ మొక్క ముడుచుకుపోయి ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఆవులు, గేదెలు వీటిని తినకుండా వెళ్లిపోతాయి. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు. రక్తాన్ని శుద్ది చేయడంలో, స్త్రీలకు వచ్చే గర్భాశయ సమస్యలను తగ్గించడంలో, ముక్కు నుండి రక్తం కారడాన్ని ఆపడంలో ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది.
మూత్రాన్ని సాఫీగా వచ్చేలా చేయడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, మూల వ్యాధిని నివారించడంలో ఈ మొక్క దోహదపడుతుంది. బోదకాలును, కామెర్లను, గుండె దడను, తుంటి నొప్పిని తగ్గించడంలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క వేర్ల కషాయాన్ని 400 గ్రా. లనీటిలో కలుపుకుని రెండు పూటలా తాగడం వల్ల పాము కాటుకు విరుగుడులా పని చేస్తుంది. ఈ మొక్క వేర్లను, ఆకులను ఎండబెట్టి పొడిలా చేసి రోజుకి 20 గ్రా. ల చొప్పున తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నయం అవుతుంది.
అత్తిపత్తి మొక్కను తీసుకుని ఎండబెట్టి చూర్ణంలా చేసి 3 గ్రా. ల చొప్పున ఒక చెంచా పంచదారతో కలిపి రెండు పూటలా తీసుకుంటే నీళ్ల విరేచనాలు, రక్త మొలలు తగ్గుతాయి. ఈ మొక్క వేర్లతో చేసిన కషాయాన్ని నోటిలో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఈ మొక్క ఆకుల రసాన్ని 30 ఎంఎల్ చొప్పున తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఒక భాగం అత్తిపత్తి మొక్క ఆకుల పొడి, రెండు భాగాలు పటిక బెల్లం పొడిని కలిపి పూటకు అర టీ స్పూన్ చొప్పున మంచి నీటితో కలిపి తీసుకుంటే ఆగిన బహిష్టు వస్తుంది. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి బోదకాలుపై వేసి కట్టుగా కట్టడం వల్ల బోదకాలు వాపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.