Eating Meals : మన పూర్వీకులు ప్రతి పనిని నియమ నిబంధనలతో ఒక పద్దతిగా చేసే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పద్దతులన్నీ మారిపోతున్నాయి. మన పూర్వీకులు పాటించిన పద్దతులల్లో ప్రతి దానికి కూడా ఎంతో శాస్త్రీయత ఉంటుంది. ఈ పద్దతులను, నియమాలను పాటించడంలో మనం ఎంతో విఫలమయ్యాము. మన పూర్వీకులు పాటించిన నియమాలలో పద్దతిగా భోజనం చేయడం ఒకటి. మనం తిన్న భోజనం వంటికి పట్టాలన్నా, మనకు శాంతి చేకూరాలన్నా ఒక పద్దతిలో భోజనం చేయాలి. భోజనం తయారు చేసే వారు కచ్చితంగా స్నానం చేసే భోజనాన్ని తయారు చేయాలి. దంతాలను శుభ్రం చేసుకోకుండా, కాళ్లకు చెప్పులను ధరించి అస్సలు వంట చేయరాదని పెద్దలు చెబుతున్నారు.
భోజనాన్ని తిన్న తరువాత, తినడానికి ముందు కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. భోజనం చేసే ముందు కాళ్లు, చేతులు తడి లేకుండా తుడుచుకోవాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయాలి. భోజనాన్ని వడ్డించుకునేటప్పుడు లేదా ఇతరులకు వడ్డించేటప్పుడు వడ్డించే పదార్థాలను కంచానికి తగలకుండా వడ్డించాలి. కంచానికి తగిలేలా వడ్డించడం వల్ల అవి ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలను ఎవరికి వడ్డించినా అది దోషమవుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు.
ఆహార పదార్థాలను వడ్డించేటప్పుడు కొద్దిగా ఎత్తు నుండి వడ్డించాలి. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించకూడదు. తాకరాదు. ఎడమ చేత్తో తినే కంచాన్ని ముట్టుకోరాదు. చొట్టలు పడిన కంచంలో, పగిలిన కంచంలో భోజనం చేయకూడదు. అరటి ఆకులలో భోజనం చేయడం చాలా ఉత్తమమైన పని అని వారు చెబుతున్నారు. నిలబడి భోజనాన్ని అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల దరిద్రులుగా మారతారని శాస్త్రాలు చెబుతున్నాయి. భోజనం తినేటప్పుడు మధ్యలో నుండి అస్సలు లేవరాదు. కోపంతో భోజనాన్ని అస్సలు తయారు చేయకూడదు. ఇతరులకు వడ్డించకూడదు. మాడిపోయిన అన్నాన్ని అతిథులకు వడ్డించకూడదు.
భోజనం చేసిన తరువాత వెంట్రుకలను కత్తిరించకూడదు. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మనం తినగా మిగిలిన అన్నాన్ని వారికి వడ్డించకూడదు. వారి కోసం ప్రత్యేకంగా భోజనాన్ని తయారు చేయాలి. ఎంత ఆకలితో ఉన్నా కూడా గిన్నె మొత్తం ఖాళీ చేయకూడదు. ఎంతో కొంత గిన్నెలో ఉంచాలి. ఆహార పదార్థాలు ఉంచిన గిన్నెలకు కాళ్లను తగిలించరాదు. భోజనం చేసేటప్పుడు నీళ్ల గ్లాసును కుడి వైపుకు ఉంచుకోవాలి. భోజనం చేసిన తరువాత విస్తర్లను ఎత్తే వారికి వచ్చే పుణ్యం అన్నదానం చేసే వారికి కూడా రాదని శాస్త్రం చెబుతోంది.
ఒకసారి వండిన పదార్థాలను మరోసారి వేడి చేసి తినకూడదు. స్త్రీలు చేతులకు గాజులు లేకుండా భోజనాన్ని తినకూడదు. వడ్డించకూడదు. భోజనం చేసిన తరువాత నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి. చాలా మంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇలా తినడం వల్ల మనం తిన్న తిండి మన వంటికి పట్టదని మంచం కోళ్లకు పడుతుందని మన పెద్దలు చెబుతున్నారు. మంచం మీద కూర్చొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు. వంట వండేటప్పుడు, భోజనం చేసేటప్పుడు భగవంతున్ని స్మరించుకోవాలని పెద్దలు చెబుతున్నారు.