Cashew Nuts : అధిక బరువు సమస్య మనలో చాలా మందిని ప్రస్తుతం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధిక బరువు ఉన్నవారిది ఒక సమస్య అయితే.. సన్నగా ఉన్నవారిది ఇంకో సమస్య. వారు బరువు పెరగాలని చూస్తుంటారు. అందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ బరువు పెరగలేకపోతుంటారు. అయితే వాస్తవానికి అధికంగా బరువు ఉండడం కంటే.. బరువు తక్కువగా ఉండడం వల్లే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో పోషకాహార లోపాలు వస్తుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తరచూ జబ్బుల బారిన పడుతూ ఉంటారు.

బరువు తక్కువగా ఉండడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది. కనుక వయస్సుకు తగినంతగా బరువును కచ్చితంగా కలిగి ఉండాలి. బరువు పెరగడానికి బయట దొరికే టానిక్ లను, పౌడర్ లను వాడడానికి బదులుగా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం తొందరగా బరువును పెరగవచ్చు. వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలతో ఓ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా బరువు పెరగవచ్చు.
బరువు పెరగడానికి ఉపయోగపడే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో గుప్పెడు ఎండు ద్రాక్షను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పొడిని వేసి అందులోనే కాచి చల్లార్చిన పాలను పోసి కలిపి.. రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న ఎండు ద్రాక్ష, పాల మిశ్రమాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో నేరుగా తినవచ్చు లేదా జార్ లో వేసి మిక్సీ పట్టి డ్రింక్ లా చేసుకుని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా తొందరగా బరువు పెరుగుతారు.
పిల్లలకు కూడా దీనిని నేరుగా ఆహారంగా ఇవ్వవచ్చు లేదా ఏదైనా పండును కలిపి మిక్సీ పట్టి స్మూతీలా చేసి కూడా ఇవ్వవచ్చు. ఇందులో జీడిపప్పు పొడికి బదులుగా ఇతర డ్రై ఫ్రూట్స్ ను కూడా పొడిగా చేసి వేసుకోవచ్చు. ఎండు ద్రాక్షలు, జీడిపప్పులలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు పెరగడంలో సహాయపడతాయి. వీటితోపాటు ప్రోటీన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న డ్రింక్ ను తాగడం వల్ల కండ పుష్టి కోసం వ్యాయామాలు చేసే వారు కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.