Oats Omelette : మనం ఓట్స్ ను అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ ను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. చర్మంపై వచ్చే దద్దుర్లలను, దురదలను తగ్గించడంలో ఓట్స్ ఉపయోగపడతాయి.
ఓట్స్ ను మనం ఎక్కువగా పాలలో వేసుకుని తింటుంటాం. కొందరు ఉప్మాగా చేసుకుని కూడా తింటుంటారు. ఓట్స్ తో ఎంతో రుచిగా ఆమ్లెట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తో తయారు చేసే ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేరయడం కూడా చాలా సులభమే. ఓట్స్ తో ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, పాలు – తగినన్ని, ఎగ్స్ – 3, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1 (చిన్నది), చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (చిన్నది), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన టమాట – 1 (చిన్నది), చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, క్యారెట్ తురుము – కొద్దిగా, నూనె – పావు కప్పు.
ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా ఓట్స్ ను జార్ లో వేసి మెత్తని పొడిలా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో తగినన్ని పాలను పోసుకుంటూ దోశలా పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు మరో గిన్నెలో ఎగ్స్ ను, మిరియాల పొడిని, ఎగ్స్ కు తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన ఓట్స్ మిశ్రమంలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి.
ఇందులోనే ముందుగా కలిపి ఉంచిన ఎగ్స్ ను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పెనం మీద రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడయ్యాక కావల్సిన పరిమాణంలో ఓట్స్ మిశ్రమాన్ని తీసుకుని ఆమ్లెట్ లా వేసి మూత పెట్టి చిన్న మంటపై 3 నిమిషాల పాటు ఉంచాలి. 3 నిమిషాల తరువాత మూత తీసి ఆమ్లెట్ ను మరో వైపు తిప్పి ఎర్రగా అయ్యే వరకు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఆమ్లెట్ తయారవుతుంది. వేడి వేడిగా ఈ ఆమ్లెట్ ను తినడం వల్ల చాలా రుచిగా ఉండడమే కాకుండా ఓట్స్, ఎగ్స్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.