Watermelon Ice Cream : వేసవి తాపం నుండి బయట పడడానికి మనం చల్ల చల్లగా ఉండే ఐస్ క్రీమ్ లను తింటూ ఉంటాం. అయితే బయట దొరికే ఐస్ క్రీమ్ లలో పంచదార ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మనకు అధికంగా క్యాలరీలు లభిస్తాయి. అంతే కాకుండా ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి గాను వీటిలో ప్రిజర్వేటివ్స్ ను కలుపుతూ ఉంటారు. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
తక్కువ పంచదారను ఉపయోగించి, ఆరోగ్యానికి మేలు చేసేలా పుచ్చకాయతో మనం ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయను మనం ఎక్కువగా ముక్కలుగా చేసుకుని తింటూ ఉంటాం. దీనిని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో ఐస్ క్రీమ్ ను చాలా సులువుగా, చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయతో ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
వాటర్ మిలన్ జ్యూస్ – ఒకటిన్నర గ్లాస్, పంచదార – 2 టీ స్పూన్స్, ఉప్పు – చిటికెడు, ఐస్ క్రీమ్ అచ్చులు – 3.
వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారీ విధానం..
వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ను తయారు చేయడానికి గాను ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ ను తయారు చేసుకోవాలి. వాటర్ మిలన్ జ్యూస్ ను మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ ముక్కల నుండి గింజలను తీసేసి జార్ లో వేసి మెత్తగా చేసి జల్లి గంటెతో వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటర్ మిలన్ జ్యూస్ తయారవుతుంది. ఇలా తయారు చేసిన జ్యూస్ ను ఒకటిన్నర గ్లాస్ చొప్పున ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, ఉప్పు వేసి పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అచ్చులను తీసుకుని అందులో పంచదార, ఉప్పు వేసి కలిపిన వాటర్ మిలన్ జ్యూస్ ను పోసి 4 నుండి 5 గంటల పాటు డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి.
4 లేదా 5 గంటల తరువాత ఐస్ క్రీమ్ అచ్చులను ఫ్రిజ్ నుండి బయటకు తీసి చల్లటి నీటిలో 10 నిమిషాల పాటు ఉంచితే ఐస్ క్రీమ్ బయటకు సులభంగా వస్తుంది. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారవుతుంది. ఐస్ క్రీమ్ అచ్చులు అందుబాటులో లేని వారు గ్లాసులో లేదా గిన్నెలో వాటర్ మిలన్ జ్యూస్ ను పోసి పై నుండి అల్యూమినియం షీట్ ను ఉంచి దానికి మధ్యలో రంధ్రం చేసి ఐస్ క్రీమ్ పుల్లను ఉంచి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారవుతుంది.
అల్యూమినియం షీట్ కూడా అందుబాటులో లేని వారు గ్లాస్ లేదా గిన్నెను ఫ్రిజ్ లో పెడితే 2 గంటల తరువాత ఐస్ క్రీమ్ కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు అందులో ఐస్ క్రీమ్ పుల్లను ఉంచి మళ్లీ ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారవుతుంది. వాటర్ మిలన్ ను నేరుగా తినని పిల్లలకు లేదా ఐస్ క్రీమ్ ఎక్కువగా తినే పిల్లలకు ఇలా ఐస్ క్రీమ్ ను చేసి ఇవ్వడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.