Sweet Potato : మనం అనేక రకాల దుంపలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో చిలగడదుంపలు కూడా ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. ఇతర దుంపల లాగా ఈ దుంప కూడా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. చిలగడదుంపలలో విటమిన్ బి 6, విటమిన్ డిలతోపాటు మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
ఊపిరితిత్తుల పని తీరును మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చిలగడదుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. కంటి చూపును, జ్ఞాపక శక్తిని పెంచడంలో ఇవి దోహదపడతాయి. చిలగడ దుంపలు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే నొప్పులు, వాపులు తగ్గుతాయి. వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చిలగదుంపలను కొందరు నేరుగా నీళ్లల్లో వేసి ఉడికిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చిలగడ దుంపల రుచి మారిపోతుంది.
తియ్యగా ఉండే చిలగడ దుంపలను నేరుగా ఉడికిస్తే రుచి తక్కువగా అయి చప్పగా మారుతాయి. చిలగడ దుంపలలో ఉండే పోషకాలు పోకుండా రుచి మరింత పెరిగేలా వీటిని ఎలా ఉడికించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మందపాటి గిన్నెలో లేదా కుక్కర్ లో చిలగడ దుంపలను ఒకదాని పక్కన ఒకటి ఉంచాలి. ఉదాహరణకు కుక్కర్‌ను తీసుకుంటే అందులో ఏమీ వేయకుండా నేరుగా చిలగడ దుంపలను ఒక దాని పక్కన ఒకటి ఉంచాలి. తరువాత కుక్కర్ మీద ఒక లోతైన గిన్నెను పెట్టాలి. గిన్నె అడుగు భాగం కుక్కర్ లోపల కిందకు ఉండాలి. ఇక ఈ గిన్నెలో నీళ్లను పోయాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు గిన్నెను దించి చిలగడ దుంపలు ఉడికాయో లేదో చూడాలి. ఉడికితే వాటిని తీసి పక్కన పెట్టి తరువాత పొట్టు తీసి నేరుగా తినవచ్చు. లేదంటే వాటిని ఇంకో వైపుకు తిప్పాలి. అనంతరం మళ్లీ నీళ్లతో ఉన్న గిన్నెను కుక్కర్ మీద పెట్టాలి. తరువాత ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో చిలగడ దుంపలు సరిగ్గా ఉడుకుతాయి. ఇలా ఈ దుంపలను నేరుగా నీటిలో వేయకుండా ఆవిరిపై ఉడికించాలి. దీంతో పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. తద్వారా వాటిల్లోని పోషకాలు అన్నీ మనకు లభిస్తాయి. వాటిని తినడం వల్ల పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.