Jonna Dosa : మనకు లభించే వివిధ రకాల చిరు ధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతున్న కారణంగా వీటిని వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. జొన్నలతో మనం రొట్టెలనే కాకుండా దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోషకాలను, శక్తిని అందిస్తాయి. ఇక జొన్న దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – 3 కప్పులు, మినప పప్పు – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – పావు కప్పు.
జొన్న దోశ తయారు చేసే విధానం..
ముందుగా మినప పప్పును, మెంతులను కలిపి నానబెట్టుకోవాలి. అటుకులను వేరే గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మిపప పప్పును, అటుకులను, రుచికి తగినంత ఉప్పును వేసి జార్‌లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జొన్న పిండిని కూడా వేసి తగినన్ని నీళ్లను పోసి మరలా మెత్తగా పట్టుకుని గిన్నెలో వేసి మూత పెట్టాలి. ఈ మిశ్రమాన్ని 10 నుండి 12 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇలా పులియబెట్టుకున్న తరువాత పిండిని మరోసారి గరిటెతో బాగా కలపాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడి అయిన తరువాత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. ఇప్పుడు నూనెను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ ఉండే జొన్న దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా జొన్నలలో ఉండే పోషకాలు శరీరానికి లభిస్తాయి. జొన్నలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.