Instant Jowar Dosa : మనకు విరివిరిగా లభించే చిరు ధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి వీటిని ఆహారంగా తీసుకునే వారు ఎక్కువవుతున్నారు. జొన్నలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని కూడా మనకు తెలుసు. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో మనకు జొన్నలు ఎంతగానో ఉపయోగపడతాయి.
జొన్న పిండితో చాలా మంది రొట్టెలను తయారు చేస్తూ ఉంటారు. జొన్న పిండితో రొట్టెలను కాకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న పిండితో దోశలను తయారు చేయడం కూడా చాలా సులభమే. అప్పటికప్పుడు జొన్న పిండితో ఎంతో రుచిగా ఉండే దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ జొన్న దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, నూనె – అర కప్పు.
ఇన్ స్టాంట్ జొన్న దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసుకుంటూ దోశ పిండి కంటే కూడా పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం బాగా వేడి అయిన తరువాత కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తరువాత నూనె ను వేసి దోశ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా జొన్న పిండి దోశను తినడం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జొన్న పిండితో తరచూ చేసుకునే రొట్టెలకు బదులుగా ఇలా అప్పుడప్పుడూ దోశలను కూడా తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.