Dondakaya Vepudu : దొండకాయలు మనకు సహజంగానే అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. వీటితో చాలా మంది అనేక రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పచ్చడి, వేపుడు వంటివి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వేపుడును తయారు చేయడంలో కొందరు సక్సెస్ కాలేకపోతుంటారు. ఎప్పుడు చేసినా నీళ్లు నీళ్లుగా చేస్తారు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే దొండకాయను నీళ్లు లేకుండా పొడిగా వేపుడుగా తయారు చేయవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – అర కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5 లేదా 6, శనగపప్పు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పుట్నాల పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్నాల పప్పు – ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్.
దొండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలను, శనగపప్పును, మినప పప్పును, ఆవాలను, జీలకర్రను, ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయలను, ఉప్పును, పసుపును వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఎండు కొబ్బరి ముక్కలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే పుట్నాల పొడి తయారీకి కావల్సిన మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
10 నిమిషాల తరువాత దొండకాయల మీద ఉంచిన మూత తీసి ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని, తగినంత కారాన్ని వేసి కలిపి దొండకాయ ముక్కలను పూర్తిగా వేయించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ వేపుడు తయారవుతుంది. మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీనిని ఇతర వేపుళ్లలో కూడా ఉపయోగించుకోవచ్చు. తరచూ చేసే దొండకాయ వేపుడుకు బదులుగా ఇలా పుట్నాల పొడిని వేసి కూడా మనం దొండకాయ వేపుడును తయారు చేసుకోవచ్చు. ఈ వేపుడును అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దొండకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.