Coconut Milk Shake : మనం ఎండ నుండి తక్షణ ఉపశమానాన్ని పొందడానికి కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ కొబ్బరి బొండాలలో లేత కొబ్బరి కూడా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ లేత కొబ్బరిని తినడం వల్ల కూడా మన శరీరానికి మేలు కలుగుతుంది. మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఈ లేత కొబ్బరిలో ఉంటాయి. దీనిని చాలా మంది నేరుగా లేదా పంచదారతో కలిపి తింటూ ఉంటారు. అంతేకాకుండా లేత కొబ్బరితో ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ ను తయారు చేసుకుని తాగవచ్చు. ఈ మిల్క్ షేక్ ను చాలా సులువుగా 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే లేత కొబ్బరి మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లేత కొబ్బరి మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత కొబ్బరి – ఒక కప్పు, చల్లని పాలు – అర గ్లాసు, కొబ్బరి నీళ్లు – ఒక గ్లాసు, పంచదార – ఒక కప్పు.
లేత కొబ్బరి మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పంచదారను, లేత కొబ్బరిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొబ్బరి నీళ్లను, పాలను పోసి 3 నిమిషాల పాటు మిక్సీ పట్టి గ్లాస్ లో పోసి తగినన్ని ఐస్ క్యూబ్స్ ను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లేత కొబ్బరి మిల్క్ షేక్ తయారవుతుంది. లేత కొబ్బరిని తినడానికి బదులుగా ఇలా అప్పుడప్పుడూ ఇలా మిల్క్ షేక్ ను చేసుకుని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం లభించడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.