Mint Leaves : జుట్టు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మార్కెట్ లో దొరికే అన్నిరకాల తైలాలను, షాంపూలను ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి అధిక ధరలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటితో ఫలితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. తక్కువ ధరలో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం మన జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు. మనం వంటింట్లో ఉపయోగించే పుదీనాను వాడి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన జుట్టుకు కావల్సిన బలాన్ని, మంచి రంగును ఇవ్వడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. పుదీనాను ఉపయోగించి మనం మన జుట్టు సమస్యలను ఎలా నివారించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనాను ఎటువంటి సందేహం లేకుండా మనం వాడవచ్చు. పుదీనా ఆకులనే కాకుండా పుదీనా తైలాన్ని ఉపయోగించి కూడా మన జుట్టును మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పుదీనా ఆకులు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తలలో చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పుదీనా యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల ఒత్తిడితోపాటు తలలో వచ్చే దురదలు కూడా తగ్గుతాయి. పుదీనా జుట్టు పెరుగుదలను కూడా బాగా ప్రోత్సహిస్తుంది. పుదీనా ఆకులను పేస్ట్ గా చేసి తలకు పట్టించి రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు పొడి బారడం తగ్గి కాంతివంతంగా తయారవుతుంది.
పుదీనా తైలాన్ని ఉపయోగించడం వల్ల చుండ్రు, దురదలు, జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గి జుట్టు నల్లగా, పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది. 5 లేదా 6 చుక్కల పుదీనా నూనెలో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కానీ ఆముదం నూనెను కానీ కలిపి వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పుదీనా నూనెలో నిమ్మరసాన్ని కలిపి రాసుకోవడం వల్ల తలలో వచ్చే దురదలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ నూనెను వాడడం వల్ల జుట్టు చివర్లు చిట్లడం తగ్గుతుంది. పుదీనా నూనెను తలకు రాసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. పుదీనా నూనె జుట్టుకు కండిషనర్ గా కూడా పని చేస్తుంది. ఈ విధంగా పుదీనా ఆకులను, పుదీనా నూనెను ఉపయోగించి మన జుట్టు సమస్యలన్నింటినీ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చుతోనే నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.