Palakura Mutton : సాధారణంగా చాలా మంది మటన్‌తో అనేక రకాల వంటలను తయారు చేస్తుంటారు. కొందరు మటన్ కర్రీని వండితే కొందరు బిర్యానీ చేసుకుంటారు. ఇంకొందరు ఫ్రై చేస్తారు. అయితే మటన్‌ను పలు ఇతర పదార్థాలతోనూ కలిపి వండవచ్చు. అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అలాంటి పదార్థాల్లో పాలకూర ఒకటి. పాలకూరతో మనం పప్పు, టమాటా వంటివి చేస్తుంటాం. కానీ దీన్ని మటన్‌తో కలిపి వండితే వచ్చే టేస్టే వేరు. ఈ క్రమంలోనే పాలకూర మటన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర మటన్‌ను తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు..
మటన్ – పావు కిలో, పాలకూర – నాలుగు కట్టలు, ఉల్లిపాయలు – రెండు, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీస్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, కారం – రెండు టీస్పూన్లు, ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు, గరం మసాలా పొడి – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – మూడు టేబుల్ స్పూన్లు.
పాలకూర మటన్ తయారు చేసే విధానం..
పాలకూర, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి పాన్ లేదా కుక్కర్‌లో నూనె పోసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు దోరగా వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మటన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ముక్కలు బాగా వేగిన తరువాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత పాలకూర వేసి కలిపి పూర్తిగా దగ్గరపడే వరకు ఉడికించాలి. నీరంతా పోయాక గరం మసాలా పొడి వేసి కలిపి దించేయాలి. పాలకూరను మరుగుతున్న నీటిలో వేసి రెండు నిమిషాల తరువాత తీసి మిక్సీలో పేస్టు చేసి కూడా కలపవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర మటన్ కర్రీ తయారవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.