Banthi Chettu : మనం పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కలలో బంతి పూల మొక్క కూడా ఒకటి. ఒకప్పుడు ప్రతి ఇంట్లో బంతిపూల మొక్కలు ఉండేవి. ఈ పూల దండలతో అలంకరించిన గుమ్మాలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. బంతిపూల మొక్కలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. బంతి పూలు కారం, చేదు, వగరు, రుచిని కలిగి ఉంటాయి. బంతిపూల మొక్కలో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కామోద్దీపనలను నియంత్రించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.
బంతి చెట్టు విత్తనాలను 10 గ్రాముల మోతాదులో తీసుకుని వాటికి 10 గ్రాముల చక్కెరను కలిపి రెండు పూటలా తింటూ ఉండడం వల్ల కామోద్రేకాలు నియంత్రణలో ఉంటాయి. కంటిలో దురదలను, కళ్ల నుండి నీరు కారడాన్ని, కళ్ల మంట వంటి కంటి సమస్యలను తగ్గించడంలో బంతిపువ్వులతో చేసిన కాటుక ఎంతగానో ఉపయోగపడుతుంది. 10 గ్రాముల బంతిపువ్వులను మట్టి మూకుడులో వేసి చిన్న మంటపై నల్లగా అయ్యే వరకు ఉంచాలి. వీటిని మెత్తగా నూరి జల్లించగా వచ్చిన బూడిదలో నాటు ఆవు నెయ్యి 10 గ్రాములు, పచ్చ కర్పూరం 1 గ్రాము మోతాదులో కలిపి అతి మెత్తగా నూరి కాటుక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని కాటుకలా పెట్టుకోవడం వల్ల కళ్ల సమస్యలు తగ్గిపోతాయి.
ఒక కేజీ బంతిపూల రెక్కలను, ఒక కేజీ బంతి ఆకుల రసాన్ని, అర కిలో నువ్వుల నూనెతో కలిపి చిన్న మంటపై నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లగా అయిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను కీళ్ల నొప్పులపై రాసి మర్దనా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ నూనెను తలకు రాసుకోవడం వల్ల తల నొప్పి తగ్గుతుంది. తలలో ఉండే పేలు కూడా నశిస్తాయి. ఈ నూనెను గోరు వెచ్చగా చేసి 4 నుండి 5 చుక్కల మోతాదులో రోజూ రెండు పూటలా చెవిలో వేసుకుంటూ ఉండడం వల్ల చెవిలో హోరు సమస్య తగ్గుతుంది. ఈ నూనెలో దూదిని ముంచి పిప్పి పన్నుపై ఉంచడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. రోజూ రెండు పూటలా ఈ నూనెను ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల అల్సర్ పుండ్లు తగ్గిపోతాయి.
పది గ్రాముల బంతి ఆకులను దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని రెండు పూటలా సేవిస్తూ ఉంటే పిచ్చి, ఉన్మాదం, మూర్ఛ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. దంతాల నొప్పులతో బాధపడే వారు 10 గ్రాముల బంతిఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి ఆ నీటిని గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు పావు కేజీ బంతి ఆకుల రసాన్ని, పావు కేజీ బంతి పూల రసాన్ని, ఒక కేజీ కండ చక్కెరతో కలిపి లేత పాకం వచ్చే మరిగించి తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రెండు పూటలా అర గ్లాసు మంచి నీటితో కలిపి సేవిస్తూ ఉంటే గుండె జబ్బులు తగ్గి గుండె బలంగా తయారవుతుంది.
బంతి చెట్టు ఆకుల రసాన్ని ఒక టీ స్పూన్ నుండి మూడు టీ స్పూన్ల మోతాదులో వయస్సును బట్టి రోజుకు రెండు పూటలా సేవిస్తూ చప్పిడి పత్యం చేయడం వల్ల కామెర్ల వ్యాధి త్వరగా నయం అవుతుంది. మూత్రం బిగుసుకు పోయి చుక్కలు చుక్కలుగా వచ్చే వారు 4 టీ స్పూన్ల బంతి ఆకుల రసానికి 2 టీ స్పూన్ల కండ చక్కెరను కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉండడం వల్ల మూత్రం ధారాళంగా వస్తుంది. బంతి ఆకుల పొడి 50 గ్రాములు, దోరగా వేయించిన పిప్పిళ్ల పొడి 10 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 10 గ్రాములు, శొంఠి పొడిని 10 గ్రాముల మోతాదులో తీసుకుని వీటన్నింటినీ కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని రెండు పూటలా భోజనానికి అర గంట ముందు రెండు లేదా మూడు టీ స్పూన్ల మోతాదులో గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. స్థనాల వాపులతో బాధపడే స్త్రీలు బంతి ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను స్థనాలపై ఉంచి అది పడిపోకుండా దూదిని ఉంచి కట్టు కట్టడం వల్ల స్థనాల నొప్పి, వాపు తగ్గుతాయి. ఈ విధంగా బంతి పూల మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.