Fennel Seeds : మనం వంటింట్లో చేసే కొన్ని రకాల తీపి పదార్థాల తయారీలో సోంపు గింజలను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. సోంపు గింజలను వాడడం వల్ల తీపి పదార్థాల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా సోంపు గింజలను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరచూ సోంపు గింజలను తింటూ ఉండడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. సోంపు గింజలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. మనలో చాలా మంది భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సోంపు గింజలను ఉపయోగించి మనకు వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. వీటిని సంస్కృతంలో మధురిక అని అంటారు. వీటిని తిన్న వెంటనే వేడి చేసి తరువాత చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి.
సోంపు గింజలను తినడం వల్ల జీర్ణాశయానికి, గుండెకు, మెదడుకు బలం చేకూరుతుంది. వాత రోగాలను నయం చేయడంలో ఈ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాలేయం, మూత్రపిండాలను, మూత్రాశయాన్ని శుభ్రపరిచే శక్తి కూడా సోంపుగింజలకు ఉంటుంది. దోరగా వేయించిన సోంపు గింజల పొడి 100 గ్రాములు, వేయించిన ధనియాల పొడి 100 గ్రాములు, యాలకుల పొడి 100 గ్రాములు, ఒక రోజంతా నీటిలో నానబెట్టి పొట్టు తీసి ఎండబెట్టిన సీమ బాదం పప్పు పొడి 100 గ్రాములు, పటిక బెల్లం పొడి100 గ్రాముల మోతాదులో తీసుకుని వీటన్నింటిని కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన మూడు గంటల తరువాత ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్ వేడి పాలలో కలుపుకుని తాగడం వల్ల పుష్టిగా తయారవుతారు. అంతేకాకుండా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. దీనిని పిల్లలకు కూడా ఇవ్వవచ్చు.
అజీర్తితో పిల్లలు బాధపడుతున్నప్పుడు ఒక గ్రాము సోంపు గింజలపొడిని, ఒక గ్రాము పుదీనా ఆకుల రసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీటిలో కలిపి వడకట్టి ఆ మిశ్రమాన్ని రెండు పూటలా పిల్లలకు ఇవ్వడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. బహిష్టు ఆగిన స్త్రీలు 25 గ్రాముల సోంపు గింజలను, 40 గ్రాముల పాత బెల్లాన్ని అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. దీనిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల చాలా రోజుల నుండి ఆగిన బహిష్టు కూడా మరలా వస్తుంది.
సోంపు గింజలను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.రక్త హీనత సమస్యను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. బరువు తగ్గడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సోంపు గింజలు దోహదపడతాయి. మలబద్దకం సమస్యతో బాధపడే వారు సోంపు గింజలను తినడం వల్ల ఆ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. సోంపు గింజలను ఏదో ఒక రకంగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బాలింతలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా సోంపు గింజలు మనకు ఎంతో ఉపయోగపడతాయని, వీటిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.