Ponnaganti Kura : మన చుట్టూ ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో పొన్నగంటి కూరమొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికి తెలిసిందే. దీనిని కూరగా కూడా వండుకుని తింటుంటారు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. శాఖోపశాఖలుగా నేల మీద పాకే ఔషధ మొక్క పొన్నగంటి కూర. ఈ మొక్క ఆకులు సాధారణ ఆకు పచ్చ రంగులో కొద్దిగా మందంగా పొడుగ్గా, సన్నగా ఉంటాయి. ఈ మొక్క పువ్వులు తెల్లగా చిన్నగా ముద్దగా ఉంటాయి. కాయలు పలుచగా ఉంటాయి. ఈ కాలంలో పొన్నగంటి కూర ఎక్కువగా లభిస్తుంది. పొన్నగంటి కూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, రైబో ఫ్లేవిన్, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, జింక్ లతోపాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే చాలా మంచిది.
అంతేకాకుండా ఈ ఆకును తరచూ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొన్నగంటి కూర ఆకులను తేనెతో కలిపి తీసుకుంటూ ఉండడం వల్ల ఆస్తమా క్రమంగా తగ్గుతుంది. ఈ మొక్కలో అధికంగా ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, జీర్ణ శక్తిని పెంచడంలో పొన్నగంటి కూర ఎంతో ఉపయోగపడుతుంది. గౌట్, మూత్ర పిండాల సమస్యలతో బాధపడే వారు ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారమే దీనిని తీసుకోవాలి. పొన్నగంటి కూర మొక్క ఆకులతో వంట చేసిన తరువాత పదే పదే వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల వికారం కలుగుతుంది. దీనిని అమితంగా తినడం వల్ల మలబద్దకం కలిగే సమస్య ఉంటుంది.

పైత్యాన్ని కలిగించే గుణాన్ని కూడా ఈ మొక్క కలిగి ఉంటుంది. కఫ, పిత్త దోషాలను, జ్వరాన్ని తగ్గించడంలో కూడా పొన్నగంటి కూర సహాయపడుతుంది. దీనిని తరచూ తినడం వల్ల చర్మ రోగాలు. ప్లీహ సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి. పురుషల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో, వాటిలో ఉండే లోపాలను తగ్గించడంలో కూడా పొన్నగంటి కూర ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ పొన్నగంటి కూర ఆకుల రసంలో వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక దగ్గు సమస్య తగ్గుతుంది. కళ్ల కలకలను తగ్గించడంతోపాటు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా పొన్న గంటి కూర ఎంతో సహాయపడుతుంది.
వైరల్ ఇన్ ఫెక్షన్ ల వచ్చే జ్వరాలను తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, జీవక్రియలో ఉండే లోపాలను సవరించడంలో కూడా పొన్నగంటి కూర సహాయపడుతుంది. మొలలతో బాధ పడే వారు పొన్నగంటి కూరను ఆవు నెయ్యితో వండుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా పొన్న గంటిని కూరను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవ్చని, అంతేకాక దీనిని తరచూ ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.