Pulka : మనం ఆహారంగా తీసుకునే ధాన్యాలలో గోధుమలు కూడా ఒకటి. వీటిని చాలా కాలం నుండి మనం ఆహారంగా తీసుకుంటున్నాం. గోధుమలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. బరువు తగ్గడంలో, టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో, శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో గోధుమలు మనకు ఎంతో సహాయపడతాయి. ఈ గోధుమలను మనం పిండిగా చేసి చపాతీలను, పుల్కాలను, రోటీలను తయారు చేసుకుంటూ ఉంటాం.
అయితే మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి, బరువు తగ్గడానికి, అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు రాత్రి భోజనంలో పుల్కాలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ పుల్కాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ పుల్కాలు చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతూ ఉంటాయి. కానీ పుల్కాలు తయారు చేసిన తరువాత కూడా మెత్తగానే ఉండాలన్నా.. అలాగే ఇవి బాగా పొంగాలన్నా.. వాటిని ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – 2 కప్పులు, ఉప్పు – తగినంత, వేడి నీళ్లు – తగినన్ని.
పుల్కా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని తగినంత ఉప్పు వేసి స్పూన్ తో కలుపుకోవాలి. తరువాత తగినన్ని వేడి నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దగా అయ్యే వరకు స్పూన్ తో కలిపి పిండి గోరు వెచ్చగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. పిండి గోరు వెచ్చగా అయిన తరువాత చేత్తో పిండిని ఒక పది నిమిషాల పాటు బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత పిండిని కావల్సిన పరిమాణంలో తీసుకుంటూ పగుళ్లు లేకుండా ముద్దలుగా చేసి కొద్దిగా వత్తి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ పొడి పిండిని వేసుకుంటూ గుండ్రంగా చపాతీలా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న పుల్కాను పెనం బాగా వేడి అయిన తరువాత పెనం మీద వేసి అర నిమిషంలోగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన వెంటనే నేరుగా మంట మీద వేసి రెండు వైపులా కాల్చుకుని ఒక గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పుల్కాలు పొంగుతాయి. అలాగే చల్లగా అయిన తరువాత కూడా మెత్తగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకున్న పుల్కాలను ఏ కూరతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.