Nethi Bobbatlu : మనం వంటింట్లో అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో నేతి బొబ్బట్లు కూడా ఒకటి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ నేతి బొబ్బట్లు మనకు బయట కూడా దొరుకుతాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో మనలో చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే ఎంతో రుచిగా ఉండే ఈ నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేతి బొబ్బట్ల తయారీకి కావల్సి పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, శనగ పప్పు – ముప్పావు కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
నేతి బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగ పప్పును తీసుకుని శుభ్రపరిచి తగినన్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకుని ఉప్పును వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత 2 టేబుల్ స్పూన్ల కరిగిన నెయ్యి వేసి కలిపి పిండిని 2 గంటల పాటు నాననివ్వాలి. తరువాత నానబెట్టిన శనగపప్పును కుక్కర్ లో వేసి కొద్దిగా ఉప్పును వేసి మరీ ఎక్కువ నీటిని పోయకుండా తగినన్ని నీటిని మాత్రమే పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి శనగ పప్పును కొద్దిగా ఆరనివ్వాలి. శనగ పప్పు ఆరిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. అందులోనే బెల్లం తురుమును కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి చిన్న మంటపై కలుపుతూ ఉండాలి.
ఈ మిశ్రమాన్ని 3 నుండి 4 నిమిషాల పాటు అడుగు భాగం మాడకుండా అలాగే కలుపుతూ ఉండాలి. తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ శనగపప్పు మిశ్రమాన్ని కావల్సిన పరిమాణంలో తీసుకుని ముద్దలుగా చేసుకోవాలి. తరువాత శనగపప్పు మిశ్రమాన్ని ఏ పరిమాణంలో అయితే తీసుకున్నామో అదే పరిమాణంలో కలిపి పెట్టుకున్న మైదా పిండిని కూడా తీసుకోవాలి. చేతికి నెయ్యిని రాసుకుంటూ మైదా పిండిని చేత్తో కొద్దిగా వెడల్పుగా చేసి అందులో శనగపప్పు, బెల్లం మిశ్రమంతో చేసిన ముద్దను ఉంచి దానిని అన్ని వైపుల నుండి మూసివేసి ఆ ముద్దను గుండ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇలా అన్ని ముద్దలు చేసిన తరువాత మందంగా ఉండే ఒక పాలిథీన్ కవర్ ను తీసుకుని దానికి నెయ్యి రాసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ముద్దలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ చేత్తో పలుచగా బొబ్బట్ల ఆకారంలో వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడైన తరువాత దాని మీద నెయ్యి వేసి ఆ తరువాత ముందుగా వత్తిపెట్టుకున్న బొబ్బట్లను వేసి వాటిని రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నేతి బొబ్బట్లు తయారవుతాయి. ఈ నేతి బొబ్బట్లను మరీ ఎక్కువ సమయం పాటు కాల్చుకోకూడదు. ఎక్కువ సమయం పాటు కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు గట్టిగా తయారవుతాయి. చేత్తో బొబ్బట్లను వత్తుకోవడం రాని వారు వాటిని పూరీలు వత్తే మిషిన్ తో కూడా వత్తుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల బయట స్వీట్ షాపుల్లో దొరికే విధంగా బొబ్బట్లు తయారవుతాయి.