Sorakaya : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయతో పప్పును, కూరను, పచ్చడిని, తీపి పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయతో కేవలం కూరలనే కాకుండా మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. సొరకాయలో గుండ్రని సొరకాయ, పొడుగు సొరకాయ అనే రెండు రకాలు ఉంటాయి. ఈ రెండు రకాల సొరకాయల్లో కూడా ఔషధ గుణాలు ఒకే విధంగా ఉంటాయి. దీనిని సంస్కృతంలో తుంభి అని అంటారు. సొరకాయ తీపి రుచిని కలిగి ఉండి శరీరానికి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పైత్య శరీరతత్వం, ఉష్ణ శరీరతత్వం ఉన్న వారికి సొరకాయ ఎంతో మేలు చేస్తుంది.
కఫ, వాత శరీరతత్వం ఉన్న వారు సొరకాయను ఎక్కువగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. సొరకాయ తీగ ఆకులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని కూడా కూరగా చేసుకుని తినవచ్చు. మూత్ర బిగింపు సమస్యతో బాధపడుతున్న వారికి సొరకాయ తీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. బాగా ఎండిన సొరకాయ తీగను సేకరించి కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదను సేకరించి నీటిలో వేసి నీరు మొత్తం ఇంకి పోయే వరకు మరిగించి అడుగు భాగాన మిగిలిన మిశ్రమాన్ని సేకరించి నిల్వ చేసుకోవాలి. మూత్రం బిగుసుకు పోయినప్పుడు లేదా మూత్రం చుక్కలుగా వస్తున్నప్పుడు ఈ మిశ్రమాన్ని మూడు గ్రాముల మోతాదుగా తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగుతూ ఉండడం వల్ల మూత్ర బిగింపు సమస్య నయం అవుతుంది.
బట్టంటు రోగాలతో బాధపడే స్త్రీలకు సొరకాయ ఎంతో మేలు చేస్తుంది. సొరకాయను ముక్కలుగా కోసి ఎండబెట్టి దంచి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని బియ్యం కడిగిన నీటితో కానీ తేనెతో కలిపి కానీ తీసుకుంటూ ఉండడం వల్ల స్త్రీలలో వచ్చే బట్టంటు రోగాలు తగ్గుతాయి. పూర్వకాలంలో గుండ్రంగా ఉండే సొరకాయలను పూర్తిగా ఎండబెట్టి వాటి లోపల ఉండే గుజ్జును, విత్తనాలను తీసేసి ఆ సొరకాయలో నీళ్లు పోసుకుని బాటిల్ లా ఉపయోగించే వారు. సొరకాయలో పోసిన నీళ్లు చాలా చల్లగా ఉంటాయి.
శరీరంలో అధిక వేడితో బాధపడే వారు సొరకాయను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గడంతోపాటు అధిక వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. సొరకాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సొరకాయ మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా సొరకాయను ఉపయోగించడం వల్ల మనం అనారోగ్య సమస్యల నుండి బయటపడడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని, దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.