Neem Leaves : సర్వరోగ నివారిణి అయిన వేప చెట్టు గురించి మనందరికీ తెలుసు. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో వేప చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వేప చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మన ఆరోగ్యానికి వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు. వేప చెట్టును పూజించే సంప్రదాయం కూడా మనకు ఉంది. మనకు వచ్చే అనారోగ్య సమస్యలతోపాటు జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా వేప చెట్టు సహాయపడుతుంది.

వేప చెట్టు నుండి తీసే తైలాన్ని ఉపయోగించడం వల్ల మన జుట్టు సంబంధిత సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వేప నూనెను వారానికి రెండుసార్లు తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా తలలో ఉండే చిన్న చిన్న గాయాలు కూడా తగ్గుతాయి. వేప నూనెను రాయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. తలలో ఎక్కువగా దురద ఉంటే వేప ఆకులను నానబెట్టిన నీళ్లతో తలను శుభ్రపరుచుకోవడం వల్ల దురదలు తగ్గుతాయి. వేప ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేస్తూ ఉండడం వల్ల జుట్టు కాంతివంతంగా తయారవుతుంది.
వేప ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమంలో గుడ్డు తెలసొనను కలిపి జుట్టు కుదుళ్లలోకి ఇంకేలా, జుట్టంతటికీ పట్టించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు నిగారింపును సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా మనకు వచ్చే చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా వేప చెట్టు మనకు దోహదపడుతుంది. వేప ఆకులను, పసుపును కలిపి మెత్తగా నూరి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులపై ఈ మిశ్రమాన్ని లేపనంగా రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఈ విధంగా మనకు వచ్చే జుట్టు, చర్మ సంబంధిత సమస్యలను వేప చెట్టును ఉపయోగించి నయం చేసుకోవచ్చని, అదే విధంగా వేప చెట్టును ఉపయోగించడంవల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.