Semiya Kesari : మనం వంటింట్లో అప్పుడప్పుడూ సేమ్యాతో కూడా ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. సేమ్యాతో ఎటువంటి ఆహార పదార్థాలను తయారు చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయి. సాధారణంగా సేమ్యాతో సేమ్యా ఉప్మా, సేమ్యా పాయసం వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సేమ్యాతో ఎంతో రుచిగా ఉండే కేసరిని కూడా తయారు చేసుకోవచ్చు. సేమ్యా కేసరి చాలా రుచిగా ఉంటుంది. సేమ్యాతో కేసరిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమ్యా కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమ్యా – ఒక కప్పు, పంచదార – ముప్పావు కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, నీళ్లు – రెండున్నర కప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు.
సేమ్యా కేసరి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించుకోవాలి. తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని అందులోనే సేమ్యాను వేయాలి. ఈ సేమ్యాను కలుపుతూ రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత మరో కళాయిలో నీళ్లు పోసి నీళ్లు మరిగే వరకు వేడిచేయాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా వేయించిన సేమ్యాను వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించుకోవాలి.
తరువాత మూత తీసి పంచదారను వేయాలి. పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమ్యా కేసరి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు సేమ్యాతో చాలా త్వరగా, చాలా రుచిగా ఇలా సేమ్యా కేసరిని చేసుకుని తినవచ్చు.