Egg Pulao : మనం ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాల్సిన పదార్థాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. తక్కువ ధరలో మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే వాటిట్లో ఇవి కూడా ఒకటి. కోడిగుడ్లతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసుకోగలిగే వంటల్లో ఎగ్ పులావ్ కూడా ఒకటి. ఈ ఎగ్ పులావ్ ను చాలా సులువుగా, రుచిగా కుక్కర్ లో ఏవిధంగా వండుకోవాలి.. దీనిని తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, నానబెట్టిన బాస్మతి బియ్యం – ఒక గ్లాస్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, , ధనియాల పొడి – రెండు టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, బిర్యానీ మసాలా – అర టీ స్పూన్, పెరుగు – అర కప్పు, నీళ్లు – ఒకటింపావు గ్లాస్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా దినుసులు..
లవంగాలు -5, యాలకులు – 2, దాల్చిన చెక్క ముక్కలు – 2 , బిర్యానీ ఆకు – 2, సాజీరా – ఒక టీ స్పూన్, అనాస పువ్వు – 1.
ఎగ్ పులావ్ తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో నూనె వేసి నూనె వేడయ్యాక చిటికెడు పసుపు, అర టీ స్పూన్ కారం, గరం మసాలా, మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పును వేయాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లను వేసి చిన్న మంటపై రంగు మారే వరకు వేయించాలి. తరువాత కోడిగుడ్లను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ లో మసాలా దినుసులను వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన పచ్చి మిర్చిని, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయేలా ఒక నిమిషం పాటు వేడి చేయాలి.
తరువాత పసుపును, కారాన్ని, ధనియాల పొడిని, బిర్యానీ మసాలాను, రుచికి తగినట్టుగా మరికొద్దిగా ఉప్పును వేయాలి. తరువాత పెరుగును వేసి నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత నీళ్లను పోసి కలిపి నీళ్లు మరిగే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన ఉల్లిపాయలను, తరిగిన కొత్తిమీరను, పుదీనాను పైన చల్లాలి. తరువాత వేయించిన కోడిగుడ్లను వేసి మూత పెట్టాలి. ఇప్పుడు మంటను మధ్యస్థంగా ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి అంతాపోయిన తరువాత మూత తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పులావ్ తయారవుతంది. దీనిని నేరుగా లేదా రైతాతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.