Peacock : భారతీయ సంస్కృతిలో నెమలికి ఎంతో విశిష్టత ఉంది. నెమలి మన జాతీయ పక్షి. అలాగే శ్రీ కృష్ణుడు కూడా ఎప్పుడూ నెమలి ఫించాన్ని తలపై ధరిస్తాడు. శివుని కుమారుడైన సుబ్రమణ్యేశ్వర స్వామి వాహనం కూడా నెమలే. ఇలా పురాణాల్లో అనేక చోట్ల నెమలి గురించి ప్రస్తావన ఉంటుంది. అయితే నెమలి అసలు సంభోగంలో పాల్గొనదని, నెమలి పరవశించినప్పుడు మగ నెమలి కన్నీటి బిందువులను ఆడ నెమలి మింగడం వల్ల ఆడ నెమలి పునరుత్పత్తి చెందుతుందని చెబుతుంటారు. అందుకే అస్కలిత బ్రహ్మచారి అయిన శ్రీ కృష్ణుడు దానికి గుర్తుగా నెమలి ఫించాన్ని ధరిస్తాడని అంటారు. అసలు దీనిలో వాస్తవం ఎంత ఉంది.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెమలి అసలు శృంగారంలో పాల్గొనకుండా పునరుత్పత్తి పొందుతుంది అనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. సృష్టిలో ప్రతిజీవి కూడా లైంగికంగా కలవడం వల్ల మాత్రమే సంతానాన్ని పొందుతుంది. ఇది ప్రకృతి ధర్మం. పురుష బీజ కణాలు, స్త్రీ బీజ కణాల కలయిక ద్వారా మాత్రమే పిండోత్పత్తి జరుగుతుంది. పురుష బీజ కణాలను నోటి ద్వారా తాగడం వల్ల ఏ జీవిలో కూడా పిండోత్పత్తి జరిగినట్టు ఆధారాలు లేవు.
జీవన పరిణామ క్రమంలో కలయిక ద్వారా మాత్రమే నెమలిలో పిండోత్పత్తి జరుగుతుంది. జతకట్టడానికి సిద్ధంగా ఉన్న మగ నెమలి ఒక రకమైన శబ్దం చేస్తూ పురివిప్పి నాట్యం చేస్తూ ఆడ నెమలికి సంకేతాలను ఇస్తుంది. మగ నెమలి ఆకర్షణకు గురైన ఆడ నెమలి దానితో జత కడుతుంది. కేవలం మగ నెమళ్లు మాత్రమే ఫించాన్ని కలిగి ఉంటాయి. ఆడ నెమలికి ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగుల్లో ఫించం ఉంటుంది. మగ నెమలి లాగా ఆడ నెమలికి పొడవాటి ఈకలు ఉండవు. ఆడ నెమలికి తలపై కుచ్చులాంటి ఆకారం ఉంటుంది. చాలా మంది పుస్తకాల్లో నెమలి ఈకను ఉంచితే అది పిల్లలు పెడుతుందని భావిస్తూ ఉంటారు. ఇది కూడా అపోహ మాత్రమేనని చెబుతున్నారు.