వెయ్యేళ్లకు పైబడి జీవించే ఫీనిక్స్ పక్షి, మృత్యు ఘడియలలో ప్రవేశించినప్పుడు, తనలోంచి ఉద్భవించే అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ కాలిపోయిన బూడిదలో నుంచి బుల్లి ఫీనిక్స్ పక్షి మరలా జన్మ నెత్తి మరో సుదీర్ఘ జీవన చక్రమునకు సిద్ధమవుతుంది. తన చితిలోంచి నుంచి తిరిగి పుట్టడం అనేది ఫీనిక్స్ పక్షి యొక్క ప్రత్యేకత అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు!
పైన చెప్పుకున్నది నిజమా? అంటే… నిజం కాదు. ఫినిక్స్ అంతరించిపోయిన జీవి అంతకంటే కాదు. ఈ పక్షి కేవలం ప్రాచీన కాల్పనిక కథలలో అప్పటి రచయితల చేత సృష్టించబడినది, అంతే! మన పౌరాణిక రచనల్లో కామరూప శక్తి కలిగిన ప్రాణులు వున్నట్లే, గ్రీకువారి పురాతన కాల్పనిక చరిత్రలో ఈ ఫీనిక్స్ పక్షి పురుడుపోసుకుందన్న మాట! అక్కడి నుంచి ఈ పక్షి ఎగురుకుంటూ రోమన్ సంస్కృతిలో, పర్సియన్ కల్పనలలో కూడా చోటును సంపాదించుకుంది.
ఇదండీ ఫీనిక్స్ సంగతి! అంచనాలను తలక్రిందులు చేస్తూ పడి లేచిన కెరటాంలా జీవితంలో అథః పాతాళం నుంచి పైకి ఆకాశమంత ఎదిగిన వ్యక్తులను ఫీనిక్స్ పక్షితో పోల్చడం పరిపాటి.